Telangana Govt Response to ETV Bharat Story On Teachers Transfer : వనపర్తి జిల్లా రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలపై ఈనెల 4న 'ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్'లో ప్రసారమైన 'ఏడు తరగతులు - ఒకే టీచర్' అనే కథనంపై అధికారులు స్పందించారు. పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వంద మంది విద్యార్థులుండగా ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహించేవారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ముగ్గురు ఉపాధ్యాయులు వెళ్లిపోయారు. పాఠశాలలో రజిత అనే ఉపాధ్యాయురాలు ఒక్కరే మిగిలారు.
ఉపాధ్యాయులు లేక తమ పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయని తల్లిదండ్రుల ఆవేదన ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్‌లో ప్రచురించడంతో పాటు ప్రసారం చేశారు. దీనిపై స్పందించిన మండల విద్యాధికారి కృష్ణయ్య సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై తిరిగి వచ్చారు. తిరిగి పని చేసే చోటుకు రావడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు.
"మా పిల్లలు వంద మంది వరకు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల వల్ల ఈ స్కూల్లో ఉండే నలుగురు టీచర్లలో ముగ్గురు టీచర్లు వేరే చోటుకు వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లేటప్పుడు మా పిల్లలు చాలా బాధపడ్డారు. అయితే 100 మంది పిల్లలకు ఒకే టీచర్ మిగిలారు. దీంతో మేం పిల్లలను బడి మార్పించాల్సి వస్తుందని అనుకున్నాం. అయితే ఈ స్కూల్ మాకు దగ్గరలో ఉంది. వేరే చోటుకు పంపాలంటే కష్టంగా అనిపించింది. మా సమస్యను ఈటీవీ భారత్‌తో పంచుకున్నాం. వాళ్లు మా బాధను కథనంలా పబ్లిష్ చేశారు. అది కాస్త అధికారుల దృష్టికి వెళ్లడం, అక్కడి నుంచి ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఈ స్కూల్ నుంచి బదిలీ చేసిన ముగ్గురు టీచర్లను మళ్లీ ఇక్కడికే పంపారు. మా సమస్య పరిష్కరించిన ప్రభుత్వానికి, సర్కార్ దృష్టికి మా సమస్యను తీసుకెళ్లడానికి సాయం చేసిన ఈటీవీ భారత్‌కు ధన్యావాదాలు." - విద్యార్థుల తల్లిదండ్రులు
అసలేం జరిగింది : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం ఏడు తరగతులకు ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉన్నారు. ఈ పాఠశాలలో మొత్తం 100 మంది విద్యార్థులు. గతంలో ఇక్కడ ఓ హిందీ పండిట్, ఓ స్కూల్ అసిస్టెంట్, నలుగురు ఎస్జీటీలు పని చేసేవాళ్లు. స్కూల్ అసిస్టెంట్ పదవీ విరమణ పొందగా, హిందీ పండిట్‌ను డిప్యుటేషన్‌పై మరో స్కూల్‌కు పంపించారు. ఇంకా మిగిలిన నలుగురు ఎస్జీటీలే ఏడు తరగతులను చూసుకుంటూ వచ్చేవారు.
అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీల్లో ఈ నలుగురు ఎస్జీటీల్లో ముగ్గురిని బదిలీపై పంపించారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఒక్క ఉపాధ్యాయురాలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఒక్కరే ఏడు తరగతులకు బోధిస్తున్నారు. టీచర్లు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపించడం మానేశారు. ఈ సమస్యపై ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ ఒక కథనాన్ని ప్రచురించడంతో అధికారులు దిగివచ్చి అక్కడి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై మళ్లీ పాత పాఠశాలకే పంపించారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో ఆనందపడుతున్నారు.