Sheep Distribution Scam Update : రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీ స్కాం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్లో తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు బయటకు వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం గొర్రెలు, మేకలు ఎన్నున్నాయో ప్రభుత్వం సమగ్ర సమాచారం సేకరించాలని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై జిల్లాల వారీగా సర్వే చేయాలని స్పష్టం చేసింది. రెండు విడతల్లో 2017 నుంచి గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం కింద గొర్రెలు, మేకలు అందజేసింది.
2017 నుంచి 2019 వరకు నాటి ప్రభుత్వం దాదాపు 90 లక్షల మేర పంపిణీ చేసినట్లు అధికారులు గణాంకాలు నమోదు చేశారు. అయితే ఈ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని ప్రస్తుత ప్రభుత్వం ఏసీబీతో విచారణకు ఆదేశించి, ఇప్పటివరకు ఈ కేసులో 9 మంది మంది నిందితులను అరెస్టు చేసింది. మరోవైపు ఈ గొర్రెల స్కాంలో భారీగా డబ్బు చేతులు మారిందని ఈడీ రంగప్రవేశం చేసింది. ఈడీ కూడా విచారణను మొదలు పెట్టింది. దాదాపు రూ.700 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో గొర్రెల పంపిణీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని గొర్రెలు, మేకలు పంపిణీ చేశారని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. వాటితో ఎంతమందికి లబ్ధి కలిగింది? ఈ మొత్తం వివరాలపై ప్రభుత్వం ఆరా తీసింది. అప్పుడు నమోదు చేసిన గణాంకాలకు, వాస్తవ గణాంకాలకు పొంతన లేదని తెలుసుకుంది. అసలు రాష్ట్రంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయనే సమాచారం కూడా కరవైందని అధికారులు ప్రభుత్వానికి నివేదన పంపారు. ఎక్కువ గొర్రెలు, మేకలు పంపిణీ చేసినట్లు చూపించారు.
ఈ లెక్కన నట్టల నివారణ, టీకాలు ఇతర మందుల కొనుగోళ్ల పేరిట భారీగా నిధులు దుర్వినియోగానికి గురయ్యాయని, అవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా గొర్రెలు, మేకలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వాటి యజమానులు, వారి తండ్రి పేరేమిటి? తదితర వివరాలు ఇవ్వాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులను గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ సుబ్బరాయుడు వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు.
తప్పు చేస్తే కఠిన చర్యలు : అందుకు ఈ నెలాఖరు వరకు గడువును ఆయన విధించారు. సమాచారం పక్కాగా ఇవ్వాలని, పశు వైద్యులు, సిబ్బంది, గొర్రెలు, మేకల కాపర్ల వద్దకు వెళ్లి వివరాలు తీసుకోవాలని అభివృద్ధి సమాఖ్య సూచించింది. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది.
చేపలు, గొర్రెల పంపిణీపై విజిలెన్స్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం