Loan Waiver for Hand loom Weavers: తెలంగాణలోని చేనేత సంఘాలు, కార్మికులకు రూ.50 కోట్ల పై చిలుకు రుణాలు ఉన్నట్లు ఆ శాఖ అంచనా వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రుణమాఫీ చేసేందుకు ఆ శాఖ కసరత్తు ప్రారంభించింది. 2017 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రుణాల సమాచారం సేకరించి ఇవ్వాలని రాష్ట్ర చేనేత శాఖ అన్నిజిల్లాల సహాయ సంచాలకులకు ఆదేశాలు జారీ చేసింది.
రుణమాఫీ పై సీఎం ప్రకటనతో కొత్త చిగురు: రాష్ట్రంలో గత ప్రభుత్వం 2010 నుంచి 2017 మార్చి 31 వరకు చేనేత కార్మికులు తీసుకున్న రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 9న హైదరాబాద్‌లో జాతీయ చేనేత సాంకేతిక సంస్థ (ఎన్‌ఐహెచ్‌టీ) ప్రారంభోత్సవంలో రైతుల మాదిరే చేనేత కార్మికులకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. రూ.30 కోట్ల వరకు రుణాలు ఉన్నాయని కార్మికులు తెలిపారని, వాటి మాఫీకి ఉత్తర్వులిచ్చే ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు.
సీఎం ఆదేశాలకు అనుగుణంగా చేనేతశాఖ ఇటీవల నేతన్నలకు రుణ మాఫీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. గత ప్రభుత్వం 2017 మార్చి 31 వరకు రుణమాఫీ చేసినందున ఆ తర్వాత నుంచి మాఫీ చేయాలని 2023-24 ఆర్థిక సంవత్సరం ఈ ఏడాది మార్చితో ముగిసినందున అప్పటివరకు ఉన్న రుణాల మాఫీని వర్తింపజేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిర్దేశిత కాలంలో రుణాలు రూ.50 కోట్లకంటే ఎక్కువ ఉంటాయని చేనేత శాఖ అధికారులు అంచనావేశారు.
రాష్ట్రంలో 259 చేనేత సంఘాలు ఉండగా 17 వేలకు పై చిలుకు మగ్గాలున్నాయి. ఒక్కోదానికి రూ.75 వేల చొప్పున చేనేత సహకార సంఘాలు రుణాల పరిమితి ఉంది. సమీక్షలో చర్చలకు అనుగుణంగా 2017 ఏప్రిల్ మొదటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న రుణాల వివరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల ఏడీల(సహయ సంచాలకుల) నుంచి వివరాలు కోరింది.
వ్యక్తిగత రుణాల పై ఏంటి సంగతి?: చేనేత శాఖ అడిగిన సమాచారంలో చేనేత సంఘాల రుణాలే ఉన్నాయి. వ్యక్తిగత రుణాల వివరాలు కోరలేదు. దీంతో పలు జిల్లాల ఏడీలు ఈ వివరాలు తీసుకోవాలా? వద్దా? అనే వివరణను కోరారు. దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత ఇస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు రుణ మాఫీలో మరమగ్గాల విషయాన్ని సీఎం ప్రస్తావించకపోవడంతో కాస్త సందిగ్ధత నెలకొంది. రాష్ట్రంలో 78 పవర్‌లూమ్ సొసైటీలుండగా వాటి పరిధిలో 49 వేల మరమగ్గాలున్నాయి. గత ప్రభుత్వం రుణమాఫీలో మరమగ్గాల కార్మికులకు వ్యక్తిగత రుణాలు కూడా మాఫీ చేసింది.
KTR Speech on Handloom : 'మళ్లీ చేనేత రుణాలు మాఫీ చేసే అంశాన్ని.. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం'