Telangana Govt Focused on Prevention of Land Encroachment Act : తెలంగాణలో రద్దయిన భూ ఆక్రమణ నిరోధక చట్టం, ప్రత్యేక కోర్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొబిషన్) చట్టం వివరాలను అందజేయాలని తాజాగా స్పెషల్ కోర్టు రిజిస్ట్రార్‌ను కోరింది. 2016 జూన్ 1న జారీ చేసిన జీవో 113కింద కోర్టు రద్దు నేపథ్యంలో వివరాలు అందజేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి టి.శేఖర్ పలు ప్రశ్నలతో కూడిన లేఖను స్పెషల్ కోర్టు రిజిస్ట్రార్‌కు రాశారు.
‘చట్టం రద్దయ్యే నాటికి ఈ చట్టం కింద ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి? ఆ కేసుల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల విస్తీర్ణం ఎంత? వాటి విలువ ఎంత? వివిధ రకాల కోర్టుల్లో ఉన్న కేసుల పరిస్థితి ఏంటి?’ అనేవి వెంటనే తెలియజేయాలని లేఖలో కోరారు. ఈ నెల 1న ‘ఈనాడు’లో ‘కబ్జాల కట్టడికి కావాలో చట్టం’ శీర్షికన ప్రచురితమైన కథనం నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం, రెవెన్యూశాఖ స్పందించినట్లు తెలుస్తోంది.
భూమి విలువ సుమారు రూ.5వేల కోట్లు : భూ ఆక్రమణ నిరోధక కోర్టు రిజిస్ట్రార్ ప్రభుత్వం కోరిన సమాచారాన్ని అందజేశారు. ‘భూ ఆక్రమణ నిరోధక కేసులు, అప్పీళ్ల కింద ఉన్న కేసుల్లోని భూముల విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతకు ముందు ప్రత్యేక కోర్టు తీర్పుల ద్వారా రక్షించిన భూముల విలువ సుమారు రూ.5 వేల కోట్ల వరకు ఉన్నట్లు అంచనా.
రాష్ట్రంలో భూ ఆక్రమణ నిరోధక చట్టం, ప్రత్యేక కోర్టు రద్దయ్యే నాటికి 541 కేసులు విచారణలో ఉన్నాయి. కోర్టు రద్దు అనంతరం 520 కేసులు జిల్లా కోర్టులకు, 21 అప్పీళ్లను హైకోర్టుకు కేసులను బదిలీ చేశారు. కోర్టుకు 80 మంజూరీ పోస్టులు ఉండగా 60 మంది సిబ్బంది ఉండగా వారిలో 19 మందిని భూ ఆక్రమణ నిరోధక కోర్టు కింద, 35 మందిని పునరావాస- పునర్నివాస అథారిటీకి, ఐదుగురిని తెలంగాణ ఫుడ్ కమిషన్‌కు, ఒకరిని సచివాలయానికి డిప్యుటేషన్‌పై పంపించారు. ఉమ్మడి రాష్ట్రంలో 3,542 కేసులకు సంబంధించిన తీర్పుల్లో రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు రక్షణ లభించింది.
ప్రభుత్వ భూముల పరిరక్షణపై సర్కారు ఫోకస్ - ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్ ఇదే!