Telangana Govt Focus On Bhudhar : ప్రతి భూదస్త్రానికి పక్కాగా గుర్తింపు తీసుకురావాలన్నదే ‘భూధార్’ప్రధాన లక్ష్యం. కేంద్రప్రభుత్వ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలు అమలుచేస్తున్న ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఐతే తాత్కాలిక, శాశ్వత అనే రెండు పద్ధతులను అనుసరిస్తోంది. ప్రతి పౌరుడికీ ‘ఆధార్’ కేటాయించినట్లే దేశంలోని ప్రతి కమతానికీ ఒక విశిష్ఠ సంఖ్యను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే భూధార్. దీనివల్ల ఆస్తులకు రికార్డు ఉంటుంది.
ప్రయోజనాలివే : భూధార్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం, హక్కులపరంగా గుర్తింపు వంటివి లభిస్తాయి. వ్యవసాయ భూముల మాదిరిగా వ్యవసాయేతర స్థలాలకి ప్రత్యేక నంబరు కేటాయిస్తారు. రాష్ట్రంలో భూధార్ ప్రాజెక్టుని ముందు తాత్కాలికంగా అమలుచేయనున్నట్లు రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు భూసమస్యలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికి ‘భూధార్’కేటాయింపు తోడ్పడుతుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
భూధార్‌తో ఈ వివరాలు తెలుసుకోవచ్చు : భూదస్త్రాల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలుత సేత్వార్, ఖాస్రా తదితర మాతృదస్త్రాలు పరిశీలించి కమతాలను నిర్ధరించి భూధార్ సంఖ్యను కేటాయిస్తారని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి. సమగ్ర భూసర్వేకన్నా ముందు తాత్కాలిక భూధార్ కేటాయింపు చేపట్టే అవకాశాలున్నాయి. ఇకపై భూధార్ సంఖ్యను నమోదుచేస్తే ఆ రైతు, భూసమాచారం కనిపించనుంది.
తద్వారా రుణాలు, రాయితీ, బీమా సహా ఇతరత్రా పథకాల అమలు సులువుగా మారనుంది. శాశ్వత భూధార్ సంఖ్య కేటాయింపునకు పూర్తిస్థాయి సర్వేచేసి అక్షాంశాలు, రేఖాంశాలతో హద్దులు గుర్తించనున్నారు. ఆబాదీ భూములకు కేంద్ర నిధులు వ్యవసాయ భూముల మాదిరిగానే గ్రామ కంఠం భూముల్లోని నివాస స్థలాలకు ‘భూధార్ కేటాయించనున్నారు.
Union Govt Allocated Funds For Bhudhar : అన్ని రాష్ట్రాల్లో భూధార్ కోసం కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. తెలంగాణలోనూ చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్వోఆర్ చట్టంలో సెక్షన్లను జోడించింది. డ్రోన్ సర్వే చేపట్టి అధికారులు పక్కాగా రికార్డులు రూపొందించనున్నారు. ఆ స్థలాలకు విశిష్ఠ సంఖ్యను కేటాయించడం ద్వారా రుణాలు, తాకట్టు, క్రయవిక్రయాల సందర్భంగా యజమానులకు సులువుగా సేవలు అందనున్నాయి. భూధార్ కేటాయింపునకు భూ యజమానులకు పైసా ఖర్చు ఉండదు. తాత్కాలిక ప్రక్రియకు ప్రభుత్వం, శాశ్వత భూధార్‌కు కేంద్రం నిధులు భరిస్తాయి. భూధార్ ప్రక్రియ మొత్తం ముగియడానికి 8వందల కోట్ల వ్యయం అయ్యే అవకాశాలున్నాయని రెవెన్యూ చట్టాల నిపుణులు చెబుతున్నారు.
'మూడేళ్లలోగా ప్రతి ప్లాట్‌కు 'భూ-ఆధార్' - పట్టణాల్లో భూరికార్డుల డిజిటలైజేషన్' - Bhu Aadhaar