Telangana Govt Delay In LRS Application Process : రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రజల నుంచి ఏకంగా 25 లక్షల 70వేల అర్జీలు వచ్చాయి. హెచ్ఎండీఏ పరిధిలో 3 లక్షల 58 వేలు, జీహచ్ఎంసీలో లక్షా ఆరు వేలు, పురపాలక సంఘాల పరిధిలో 13 లక్షల 69 వేలు, గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, పట్టణాభివృద్ధి సంస్థల వద్ద మరో లక్షా 35 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, మధ్యతరగతి వర్గాలకు ఉపమశమనం కల్పించేలా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల దుమ్ము దులిపేందుకు చర్యలు చేపట్టింది.
ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన ప్రభుత్వం అందులో మూడొంతులకుపైగా వివరాలు లేనివి, తగిన ఆధారాలు పొందుపరచని వాటిని గుర్తించి వారందరికీ సమాచారం ఇచ్చి ఆధారాలను అప్‌లోడ్ చేసుకునేందుకు సమయం ఇచ్చింది. నిషేధిత జాబితాలోని ప్రభుత్వ, దేవాదాయ శాఖ, అటవీ, వక్ఫ్, భూదాన్ తదితర భూములకు సంబంధించిన ప్లాట్లను ఎట్టి పరిస్థితుల్లో క్రమబద్ధీకరించొద్దని సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది.
అర్హత ఉన్నట్లు గుర్తిస్తేనే ఎల్ఆర్ఎస్ : ఇప్పటికే అన్ని ఆధారాలు కలిగిన దరఖాస్తులకు చెందిన ప్లాట్లను స్థానిక అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రికార్డుల్లో ఉన్న వివరాలతో క్షేత్రస్థాయిలో పోల్చి చూసిన తర్వాత తాజా పరిస్థితులపై నివేదిక ఇస్తారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పరిశీలన పూర్తయిన దరఖాస్తుల్లో ఒక్కశాతం ర్యాండమ్ చెకప్ చేస్తారు. సరైనవని తేల్చుకున్నప్పుడు ఆ అర్జీలకు చెందిన వివరాలను ఆయా మున్సిపాలిటీలు, పంచాయతీలకు పంపుతారు. అన్ని విధాలా అర్హత కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించిన తర్వాతే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల దరఖాస్తులు సరైనవిగా తేల్చి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. మిగిలిన వాటి పరిష్కారంలోనూ యంత్రాంగం కసరత్తు చేపట్టింది.
ప్రక్రియ ఆగిపోయినవి 60వేల దరఖాస్తులు : ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, నల్గొండ జిల్లాల పరిధిలో అనధికారిక లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన 60 మంది సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆడిట్‌లో తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. వీరిలో చాలా మందికి పదోన్నతులు ఆపడం, ఇంక్రిమెంట్లు నిలుపుదల చేశారు. రిజిస్ట్రేషన్లు ఆగిపోయినవి దాదాపు అరవై వేల దరఖాస్తుల పరిష్కారంపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. అనుమతులు లేకుండా భూముల్లో ప్లాట్లు కొన్నవారిలో అత్యధికులు నిరుపేద, మధ్యతరగతికి చెందినవారున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా న్యాయపరంగా ఏవిధంగా ముందుకెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో LRS లబ్ధిదారులకు మరో అద్భుత అవకాశం - అదేంటో మీకు తెలుసా? - LRS MODIFICATION IN TELANGANA
LRS నియమ నిబంధనలు విడుదల - దరఖాస్తుల కటాఫ్ తేదీ ఇదే - GOVT ISSUED REGULATIONS FOR LRS