Government Summer Camps In Telangana : నల్గొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ స్విమ్మింగ్ క్యాంపు చిన్నారులతో సందడిగా మారింది. ఈత నేర్చుకునేందుకు ఉదయం, సాయంత్రం పెద్ద ఎత్తున పిల్లలు తరలివస్తున్నారు. 9 ఏళ్ల పిల్లల నుంచి పెద్దవారికి కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. నల్గొండలో మూడు ఈత కొలనులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడకి ప్రతిరోజు సుమారు 200 మంది విద్యార్థులు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారు. స్విమ్మింగ్ చేయడం చాలా సరదాగా ఉందని మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.
సూర్యతాపం నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు ఈత కొలనులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ఈత కొలనులో ఈత నేర్చుకొవాలంటే, ఒక్కరికి నెలకు సుమారు ఐదు వేలు వరకు ఉంటుంది. కానీ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈత కొలనుల్లో నామమాత్రపు ఫీజుతో అధికారులు సభ్యత్వం ఇస్తున్నారు. ఒక్కరికి నెలకు రూ.500 ఫీజు వసూలు చేసి ఈతలో శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు త్వరగా ఈత వచ్చేలా కోచ్‌లు పలు మెలుకువలు నేర్పిస్తున్నారు. ఈత నేర్చుకోవడం వల్ల ఉల్లసంగా ఉండటంతో పాటు శారీరంగా ఉపయోగపడుతుందని అక్కడి కోచ్ చెబుతున్నారు.
"ప్రభుత్వం ఇక్కడ మూడు స్విమ్మింగ్ పూల్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. గత పదేళ్లుగా ఇక్కడ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. వేసవి కాలం రాగానే చాలా మంది పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకోడానికి వస్తారు. వారి మెడికల్ ఫిట్నెస్ను బట్టి పిల్లలను తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీళ్ల దరఖాస్తులను ఆన్లైన్లో తీసుకుంటాం." - సురేష్ , కోచ్ లైఫ్ గార్డ్
సెల్ఫ్ డిఫెన్స్ ఈరోజుల్లో చాలా ముఖ్యం : జనగామ జిల్లా నర్మెట మండలంలోని జెట్పీహెచ్ఎస్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ జోరుగా సాగుతోంది. డీవైఎస్ఓ జనగామ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వేసవి కరాటే శిక్షణ శిబిరం చిన్నారులు, విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోంది. ఈ నెల 1న తేదీనా మొదలైన ఉచిత వేసవి కరాటే కోచింగ్ క్యాంప్ ఈ నెల 30వ తేదీ దాకా నిర్వహించనున్నారు. నేటి పరిస్థితుల్లో విద్యార్థులకు చదువుతో పాటు కరాటే, క్రీడ వంటివి చాలా ముఖ్యమన్న కరాటే మాస్టర్ ఎర్రబెల్లి బాబు బాలికలకు చదువు ఒక్కటే సరిపోదని వారు ఆపద సమయంలో తమను తాము రక్షించుకునేందుకు కరాటే లాంటి సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని తెలిపారు.
"ప్రస్తుతం ఇక్కడ వందమంది పిల్లలు ఉన్నారు. వారు చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వారి తల్లిదండ్రుల సపోర్ట్ కూడా చాలా ఉంది. ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం అధికారులు ఇలానే సమ్మర్ క్యాంప్ పెట్టాలని నేను కోరుకుంటున్నా. అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా ముఖ్యం అందరూ ముఖ్యంగా నేర్చుకోవాలి." - ఎర్రబెల్లి బాబు, కరాటే మాస్టర్