TG Govt Fires Sunkishala Officers : సుంకిశాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌ను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3లో పనిచేస్తున్న సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియా రాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీశ్‌లను సస్పెండ్ చేసింది. అలాగే నిర్మాణ సంస్థకు షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సుంకిశాలలో ఆ రోజు ఏం జరిగిందంటే : హైదరాబాద్‌కు తాగునీరు అందించే సుంకిశాల ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న పంప్‌హౌస్ నీట మునిగింది. నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు పోటెత్తడం, ఒక్కసారిగా పంప్‌హౌస్ రెండో సొరంగ మార్గం నుంచి ప్రవాహం ఉద్ధృతంగా రావడంతో టన్నెల్ ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతోపాటు రక్షణ గోడలోని ఒక ప్యానెల్ కొట్టుకుపోయాయి. దీంతో 83 మీటర్ల లోతులో ఉన్న పంప్‌హౌస్‌లోని సంపు పూర్తిగా నీటితో నిండిపోయింది. ఆ సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 510 అడుగులకన్నా తగ్గితే హైదరాబాద్‌కు నీటి తరలింపు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీరు తరలించేందుకు వీలుగా నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పాల్తితండాలో సుంకిశాల గట్టు వద్ద పంప్‌హౌస్ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో జలమండలి శ్రీకారం చుట్టింది. 2021 మార్చి 16న ప్రభుత్వం మేఘా సంస్థకు పనులను కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. తొలుత రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో పనులు కేటాయించగా అక్టోబరు 2022లో వ్యయాన్ని రూ.2,214 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పనులు 70 శాతం పూర్తయ్యాయి. వివిధ లోతుల్లో నీటిని తీసుకునేందుకు వీలుగా పంప్‌హౌస్ నుంచి మూడు సొరంగాలు(టన్నెళ్లు) నిర్మిస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో 455 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా మొదటి సొరంగాన్ని, 504 అడుగుల లోతు నుంచి తీసుకునేందుకు రెండోది, 547 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా మూడోది నిర్మిస్తున్నారు.
వరద అంచనాలు తప్పడంతో : పంప్‌హౌస్, కృష్ణానదికి మధ్య కేవలం 192 మీటర్లు మాత్రమే దూరం ఉంది. వరద వచ్చిన సమయంలో ఆ ఉద్ధృతి తాకిడి పంప్‌హౌస్‌లోకి చేరకుండా రక్షణ గోడ (రిటెయినింగ్ వాల్) నిర్మించారు. వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మధ్య టన్నెల్ పనులు పూర్తిచేసే క్రమంలో సంపువైపు టన్నెల్ ముందు భారీ గేటు ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ వైపు ఉన్న మట్టిని తొలగించారు. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికిగానీ మధ్య టన్నెల్ స్థాయి వరకు వరద రాదని భావించారు. ‘దానికి భిన్నంగా దాదాపు 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో సాగర్ వద్ద అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగి ఈ నెల 2న ఉదయం 7 గంటల సమయంలో టన్నెల్‌లోకి భారీ వరద చేరింది.