TG Govt Released 213 Prisoners On Amnesty : రాష్ట్రవ్యాప్తంగా ఏళ్లపాటుగా జైళ్లలో మగ్గుతున్న 213 మంది ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ప్రజావాణిలో ఈ విషయమై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సీఎం రేవంత్, ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఫైల్లో చలనం తీసుకువచ్చారు. ఇటీవల రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసినప్పుడు దీని గురించి ప్రస్తవించారు. కాగా అదే సమయంలో ఈ దస్త్రానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో ఖైదీల విడుదలకు మార్గం సుగమమైంది.
ఈ నేపథ్యంలోనే సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేశారు. చెర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి 61 మంది, హైదరాబాద్ సెంట్రల్ జైలు నుంచి 27 మంది, వరంగల్ కేంద్ర కారాగారం నుంచి 20 మంది, ప్రిజనర్స్ అగ్రికల్చర్ కాలనీ నుంచి 31 మంది, స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ - 35, సంగారెడ్డి కేంద్ర కారాగారం నుంచి 01, నిజామాబాద్ కేంద్ర కారాగారం - 15, మహబూబ్ నగర్ జిల్లా కారాగారం - 02, నల్గొండ జిల్లా కారాగారం - 04, అదిలాబాద్ జిల్లా కారాగారం- 03, కరీంనగర్ జిల్లా కారాగారం- 07 , ఖమ్మం జిల్లా కారాగారం- 04, ఆసిఫాబాద్ స్పెషల్ సబ్ జైలు నుంచి - 03, మొత్తం ఖైదీలను చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తీసుకువచ్చి మార్గదర్శనం చేసారు.
ఖైదీల ఉపాధి బాధ్యత మాదే : అనంతరం విడుదలైన ఖైదీల్లో 33శాతం మందికి పెట్రోల్ బంక్‌లో, కార్పెంటర్లుగా, వెల్డర్‌లుగా ఉద్యోగం కల్పించారు. 10 మంది మహిళలకు కుట్టుమిషన్‌లు అందజేశారు. మిగతావారికి కూడా ఉద్యోగం కల్పించే బాధ్యత తమదేనని జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా హామీ ఇచ్చారు.
సంవత్సరాలుగా జైళ్లోనే ఉన్న వారిని ఇన్నేళ్లలో ఒకటి రెండు సార్లు మాత్రమే కలిసిన కుటుంబీకులు, కాస్త భావోద్వేగానికి గురయ్యారు. దీంతో చెర్లపల్లి జైలు ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఖైదీలు విడుదలవ్వడంతో కుటుంబీకులు సంతోషం అంబరాన్నంటింది.
Prisoners Learned Many Skills in Prison : క్షణికావేశంలో చేసిన తప్పుకు ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరమై నరకం చూశామని, ఇప్పుడు తమలో పశ్చాత్తాపం కలిగిందని, విడుదలైన ఖైదీలు అంటున్నారు. ఇన్నాళ్లు జైళ్లో పలు నైపుణ్యాలు నేర్చుకున్నామని చెబుతున్నారు. రేపటి సూర్యోదయం ఖైదీలకు నూతన సుప్రభాతం, జైలు నుంచి బయటకు రావడం కొత్త జీవితానికి శ్రీకారం.
గతాన్ని నెమరువేసుకోకుండా, భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవాలని కార్యక్రమానికి హాజరైన మోటివేషనల్ స్పీకర్లతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఖైదీలకు సూచించారు. విడుదలైన ఖైదీల మానసిక స్థితి జైలు జీవితానికి అలవాటుపడి ఉంటుందని, జనజీవన స్రవంతిలో కలిసేందుకు కాస్త సమయం పడుతుందని కుటుంబీకులు అందుకు తగ్గట్టుగా వారిని సిద్ధం చేయాలని, విడుదల ఖైదీలు అందరితో కలివిడిగా ఉండి నూతన జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు.
నేడు 213 మంది ఖైదీల విడుదల - క్షమాభిక్ష ప్రసాదించిన తెలంగాణ ప్రభుత్వం