Traffic Problems in Hyderabad : నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇది మహానగరానికి పెద్ద సవాల్‌గా మారింది. ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై మూడు కమిషనరేట్ల పోలీసులు దృష్టి సారించారు. ప్రాంతాల వారీగా సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కార్యాచరణను సిద్ధం చేసి కసరత్తు ప్రారంభించారు. ఆక్రమణలు, మలుపుల వద్ద దారి సక్రమంగా లేకపోవడం, నీరు నిలిచే ప్రాంతాలు, రోడ్డుపై విద్యుత్ స్తంభాలు, ఇంజినీరింగ్ సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలను క్షేత్రస్థాయిలో మరోసారి గుర్తిస్తున్నారు. సీఎం ఆదేశాలతో విద్యుత్, జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో వేగంగా పనులు పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియలో హైడ్రా సైతం పాలు పంచుకోనుంది.
మహానగరంలో 161 ప్రాంతాలపై దృష్టి పెట్టిన అధికారులు :
- నగరంలో దాదాపు 161 ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే మహా నగరంలో 127 కీలక జంక్షన్లు ఉన్నాయి. ప్రధానంగా ఇలాంటి చోట్లే సాధారణ రోజులతో పాటు వర్షం వేళ కూడా ట్రాఫిక్ సమస్య వస్తోంది.
- కీలకమైన జంక్షన్లలో ఫ్రీలెఫ్ట్లతో పాటు రహదారి విస్తీర్ణం పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖతో సమన్వయంతో పాటు చర్యలు చేపట్టాలని మూడు కమిషనరేట్ల అధికారులు నిర్ణయానికి వచ్చారు.
- ట్రాఫిక్ పోలీసులు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోనున్నారు. ఆ శాఖ హెచ్చరికలు వెలువడగానే ట్రాఫిక్ సిబ్బంది రద్దీగా ఉండే, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలకు చేరుకుని పర్యవేక్షిస్తారు. డీఆర్ఎఫ్ సిబ్బంది నీటిని తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తారు.
- మెహదీపట్నం, హిమాయత్‌నగర్, లక్డీకాపూల్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్ వంటి ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నరకమే. ఇది ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులకు సవాలుగా మారుతోంది. ఈ ప్రాంతాలపై ప్రస్తుతం దృష్టి సారించారు.
ఐటీ కారిడార్‌పై ప్రత్యేక దృష్టి : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత 8 నెలల్లో 250కి పైగా స్తంభాలను తొలగించారు. ఇవి రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా ఉండటంతో తొలగించేశారు. సెప్టెంబరులోనే 25కి పైగా స్తంభాలను మరోచోట ఏర్పాటు చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఐటీ కారిడార్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇక్కడ 13 చోట్ల రహదారిలో విద్యుత్ స్తంభాలున్నట్లు గుర్తించారు. ఐటీ కారిడార్‌లో వర్షం పడితే రోడ్డుపై నీరు నిలిచిపోతుంది.
దీనిపకి తోడు ఐటీ కంపెనీలకు చెందిన దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు ఒకేసారి బయటకు రావడం మరో ఇబ్బందిగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఐటీ కంపెనీల వేళలు ఒకేసారి కాకుండా కొంత వ్యత్యాసం ఉండేలా ఆ కంపెనీలతో సమన్వయం చేస్తున్నారు. దీనిపై తాజాగా సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు.