Telangana Govt Focus on Land Grabbing Cases : ఒక్కో కేసు దస్త్రం ముడి విప్పితే రూ.కోట్లు విలువ చేసే భూమి. 2016లో రద్దయిన భూ ఆక్రమణ నిరోధక చట్టం (ల్యాండ్ గ్రాబింగ్ - ప్రొహిబిషన్) కింద కోర్టులో కొనసాగిన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుంది. ప్రస్తుతం వివిధ కోర్టులో విచారణలో ఉన్న 129 ల్యాండ్ గ్రాబింగ్ కేసులను రాష్ట్ర ప్రభుత్వం గెలిస్తే, రూ.2 వేల కోట్ల విలువైన భూ నిధి ప్రభుత్వ ఖాతాలో ఉన్నట్లే. దీనికి సంబంధించి తెలంగాణ ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్టు రిజిస్ట్రార్ ఎం.సత్య ప్రభాకర్‌రావు ప్రభుత్వానికి కేసుల వారీగా, ధరలను తెలియజేస్తూ సమాచారాన్ని అందించారు.
రాష్ట్రంలో సర్కారు భూముల ఆక్రమణలపై హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. చెరువులోని బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్‌తో పాటు ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న కబ్జాలను తొలగించి స్థలాలు, భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో భూ ఆక్రమణ నిరోధక చట్టంలో నమోదైన ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించిన కేసుల్లోని భూములను కూడా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని పలు కేసుల్లో ఉన్న సర్కారు భూముల విలువ దాదాపు రూ.500 కోట్లుగా ఉన్నట్లు తెలిసింది.
రెవెన్యూ శాఖ సమాయత్తం : కోర్టు రద్దయ్యే నాటికి మొత్తం 129 కేసులు విచారణలో ఉండగా, వాటిని వివిధ జిల్లా కోర్టులకు బదిలీ చేశారు. ఆ కేసుల్లో 2,456 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. కేసులు నమోదయ్యే నాటికి వీటి విలువ రూ.1,319.21 కోట్లు. ప్రస్తుత ధరల ప్రకారం అయితే దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కోర్టు కేసుల్లో ఉన్న సర్కారు భూములను పూర్తిస్థాయిలో కాపాడేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్టులో కేసుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
కొందరు రెవెన్యూ అధికారులు భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని తిరిగి అమల్లోకి తీసుకువస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుందనే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 6న హైదరాబాద్‌లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో నిర్వహించిన ముఖాముఖి సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ భూముల రక్షణ కోసం న్యాయ నిపుణులతో బృందాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2016లో రద్దయిన ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్టుకు సంబంధించిన కేసులు, భూముల విస్తీర్ణం, విలువపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ప్రభుత్వ భూముల పరిరక్షణపై సర్కారు ఫోకస్ - ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్ ఇదే!
Land grab: కబ్జాదారుల చెరలో 10 వేల ఎకరాలు.. ఆ జిల్లాల్లోనే ఆక్రమణలు ఎక్కువ