Telangana Government Conducting Re Survey On Musi River : తెలంగాణలోని మూసీ నదీ ప్రక్షాళనలో భాగంగా నివాసాలు కోల్పోయే వారికి పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు నదీ గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అక్కడి అధికారులు రంగంలోకి దిగారు. అర్హులైన నిర్వాసితులకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి రీ-సర్వే చేస్తున్నారు. యజమానుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు ఛాదర్‌ఘాట్, మూసానగర్, శంకర్‌నగర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేపడుతున్నారు. హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యా రాణి ఆధ్వర్యంలో అధికారులు సర్వే చేపట్టారు. కూల్చివేసే ప్రాంతాలను సిబ్బంది మార్కింగ్ చేస్తున్నారు. మూసీ నది ఆక్రమణలను గుర్తించి మార్క్‌లు వేస్తున్నారు.
నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. మూసీ నదిలో ఉన్న బఫర్‌జోన్లోని నిర్మాణాలకు మార్క్ చేస్తున్నారు. బాధితులకు పునరావాసం కల్పించిన తరువాతే చర్యలు తీసుకుంటామని హిమయత్‌నగర్ తహసీల్దార్ సంధ్యా రాణి తెలిపారు. మండల పరిధిలో మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో సుమారు 225 ఇళ్లు ఉన్నట్లు గుర్తించామని, సర్వే జరుగుతుందని తెలిపారు. బాధితులకు ఇళ్ల పట్టాలు ఇచ్చాకే తరలింపు ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
5 బృందాలుగా ఏర్పడి మార్కింగ్ : హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పురా నియోజకవర్గంలో మూసీ నది రివర్ బెడ్‌లో ఉన్న ఇండ్ల వివరాలను రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీ కిషన్‌బాగ్, అసద్ బాబా నగర్, నందిముసలైగూడ ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు 5 టీంలుగా ఏర్పడి పోలీసుల సహాయంతో సర్వే చేస్తూ మార్కింగ్ చేస్తున్నారు. దాదాపు 386 ఇళ్లు మూసీ రివర్ బెడ్‌లోకి వస్తున్నాయి. బహదూర్‌పురా తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో 5 టీంలు సర్వే చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
అడ్డుకున్న స్థానికులు : గోల్కొండ రెవెన్యూ పరిధిలోని లంగర్ హౌస్ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. అందులో భాగంగా రివర్ బెల్టులో ఉన్న ఇండ్లను గుర్తించి వాటికి మార్కింగ్ చేస్తున్నారు. లంగర్‌హౌస్ ఆశ్రం నగర్లో మార్కింగ్ చేస్తున్న సమయంలో అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. 45 ఇండ్లకు అధికారులు రివర్ బెల్ట్‌లో ఉన్నట్లు గుర్తించి వాటికి మార్కింగ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సర్వేలో గోల్కొండ ఎమ్మార్వో అహల్యతో పాటు డిప్యూటీ కలెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మొదట అధికారులను స్థానికులు అడ్డుకున్నా అధికారులు మాత్రం వారికి నచ్చజెప్పి మార్కింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు.