Telangana Budget Allocation For Hyderabad Development : రాష్ట్ర రాజధానిపై బడ్జెట్లో ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి కోసం ఎప్పుడు లేని విధంగా రూ.10వేల కోట్లు కేటాయించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు నిధుల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి సారించింది.
పారిశుద్ధ్యం, మరుగు నీరు, తాగునీటి వ్యవస్థలు గత పదేళ్లలో అత్యంత నిర్లక్ష్యానికి గురైనట్లు విమర్శించిన ప్రభుత్వం మితిమీరిన కాలుష్యంతో మూసీ, హుస్సేన్ సాగర్ విషతుల్యంగా మారాయని తెలిపింది. అలాగే మురుగునీటి కాలువ నిర్వహణ లోపంతో చినుకు పడితే నగరం జలమయమై ప్రజాజీవనం అస్తవ్యస్థంగా మారే పరిస్థితి ఎదురైందని, దూరదృష్టి లేని ప్రణాళికలు, ఇబ్బడిముబ్బడిగా అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో నగరాభివృద్ధి కుంటుపడిందని ఆరోపించింది.
హైడ్రాకు ప్రత్యేక నిధులు : ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3వేల 65 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.500 కోట్లు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థను మెరుగుపర్చడానికి జలమండలికి రూ.3వేల 385 కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదించింది. అలాగే ఇటీవల ప్రభుత్వ ఆస్తులు, భూములు పరిరక్షణతోపాటు విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు కూడా ప్రత్యేకంగా రూ.200 కోట్లను కేటాయించింది.
మెట్రో విస్తరణ : మెట్రో రైలు రెండో దశ విస్తరణలో భాగంగా ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, మల్టీ మోడల్ సబ్ అర్బన్ రైలు ట్రాన్స్ పోర్టు సిస్టమ్ కోసం రూ.50 కోట్లతో పాటు ఔటర్ రింగురోడ్డు అభివృద్ధి కోసం రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.
మూసీ నది ప్రక్షాళనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పదే పదే చెబుతూ ఈసారి బడ్జెట్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవల్మెంట్ ప్రాజెక్టు కోసం రూ.1500 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో మూసీనది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవం అవుతుందని, అలాగే నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య, నివాస కేంద్రాలు వెలిసి పాత చారిత్రక ప్రాంతాలు కొత్తదనాన్ని సంతరించుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
జాతీయ రహదారులతో అనుసంధానం : ఉత్తర ప్రాంతాల్లోని 158.6 కిలోమీటర్లు పొడవున్న సంగారెడ్డి-తుప్రాన్- గజ్వేల్- చౌటుప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని 189 కిలోమీటర్లు పొడవున్న చౌటుప్పల్- షాద్నగర్ - సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్గ్రేడ్ చేయాలని ప్రతిపాదించింది. అలాగే ఆర్ఆర్ఆర్ను హైదరాబాద్ నగర ఉత్తర, దక్షిణ ప్రాంతాలనూ, తూర్పు పశ్చిమ ప్రాంతాలనూ కలుపుతూ జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని భావిస్తుంది.
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత నాలుగు మార్గాలతో నిర్మించి దానిని 8 మార్గాల సామర్థ్యానికి విస్తరిస్తామని, ఈ ప్రాజెక్టు వల్ల ఓఆర్ఆర్కు, ఆర్ఆర్ఆర్కు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణ పార్కులు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్ఆర్అర్ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి రూ.13,522 కోట్లు, దక్షిణ ప్రాంతాభివృద్ధికి రూ.12,980 కోట్ల ఖర్చు అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కేటాయించిన నిధులు ఇవే :
విభాగం | నిధుల కేటాయింపులు |
జీహెచ్ఎం | రూ.3,065 కోట్లు |
హెచ్ఎండీఏ | రూ.500 కోట్లు |
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు | రూ.1,525 కోట్లు |
ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు | రూ. 200 కోట్లు |
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు | రూ.1500 కోట్లు |
మెట్రో వాటర్ పనులు | రూ.3,385 కోట్లు |
హైడ్రా సంస్థ | రూ.200 కోట్లు |
విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ | రూ. 100 కోట్లు |
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు | రూ.500 కోట్లు |
పాతబస్తీ వరకు మెట్రో విస్తరణ | రూ.500 కోట్లు |
మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ | రూ.50 కోట్లు |
తెలంగాణ బడ్జెట్ 2024 - ఆరు గ్యారంటీలకు ఎంత కేటాయించారంటే? - TELANGANA BUDGET 2024