Family Digital Card Latest News : రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరింది. నాలుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు, మెరుగైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ సిద్ధం చేస్తున్న డిజిటల్ కార్డు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కార్డులో ఏ అంశాలుండాలి, తొలుత ఏ పథకాలను చేర్చాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుందన్న అధికారులు, కుటుంబం మొత్తానికి ఆధార్ తరహాలో ఓ ప్రత్యేక సంఖ్య కేటాయించనున్నట్లు తెలిపారు. ఆ కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి విడివిడిగా ప్రత్యేక సంఖ్య ఇవ్వనున్నారు. కార్డుపై కుటుంబ యజమాని ఫొటో ఉంచనున్నారు. కుటుంబ యజమానిగా మహిళనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించినందున కార్డుపై వారి ఫొటోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
కొన్ని మార్పులు - చేర్పులకు అవకాశం : ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కోసం ఒకటి, ఆరోగ్యానికి మరొకటి, ఇతర పథకాలకు ఇంకోటి ఇలా వేర్వేరుగా కార్డులున్నాయి. ఇక నుంచి ఒకే కార్డులో లబ్ధిదారులు అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాల వివరాలుండేలా ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకు వస్తోంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ కన్వీనర్‌గా సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సెప్టెంబరు 25 నుంచి 27 వరకు రాజస్థాన్, కర్ణాటక, హరియాణా, మహారాష్ట్రలో అధ్యయనం చేసి సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. గత పది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డుల రూపకల్పనపై ఉన్నతాధికారులతో ఐదారు సమావేశాలు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని మేలైన అంశాలు తీసుకొంటూ, కార్డు రూపకల్పన దాదాపు కొలిక్కివచ్చినా, కొన్ని మార్పుచేర్పులు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తొలుత ఆ రెండు పథకాల లబ్ధిదారులకు ప్రయోజనం : తొలుత రేషన్, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులను అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. తొలుత ఆ లబ్దిదారుల వివరాలను డిజిటల్ కార్డుల్లో నమోదు చేయనున్నారు. అనంతరం కొత్తగా ఇచ్చే రేషన్ కార్డుల వివరాలను చేర్చనున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ వివరాలను తొలి దశలో అనుసంధానించనున్నట్లు సమాచారం.
ఆ తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పింఛన్ల పథకాలు, లబ్ధిదారులను డిజిటల్ కార్డులో చేర్చే అవకాశాలున్నాయి. భవిష్యత్‌లో ఏదైనా పథకానికి దరఖాస్తు చేయాల్సి వస్తే, పదే పదే ఆధార్ సమర్పించడం వంటి వ్యయప్రయాసలు ఉండవని ఓ అధికారి తెలిపారు. డిజిటల్ కార్డులోని కుటుంబసభ్యుడి, సభ్యురాలి యూనిక్ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుందన్నారు.