Polling Material Distribution in Telangana : రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (మే 13వ తేదీ 2024) లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల పరికరాలను ఆయా బూత్‌లకు అధికారులు తరలిస్తున్నారు. పటిష్ఠ బందోబస్తు మధ్య ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ లోకసభ ఎన్నికల పోలింగ్‌పై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,944 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. లోక్‌సభ నియోజకవర్గంలో 22 లక్షల 17వేల 305 మంది ఓటర్లు ఉండగా తగినన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపు (మే 13వ తేదీ) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ పెంచే చర్యల్లో భాగంగా మారుమూల తండాలు, గూడాల్లో అనుబంధ పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసు బలగాలు ఎక్కడికక్కడ భారీగా మోహరించాయి. అన్ని జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు డీఆర్సీ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ యాకుత్‌పురాలో ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని పరిశీలించిన సీఈవో వికాస్‌రాజ్ పోలింగ్ సిబ్బంది ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు
చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో మొత్తం 2877 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 216 మంది సూక్ష్మ పరిశీలకులు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో సేవలు అందించనున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజక వర్గంలో మొత్తం 29 లక్షల 38 వేల 370 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశాంక్ సూచించారు.
పెద్దపల్లి జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన సిబ్బందికి పోలింగ్ సెంటర్లలో ఈవీఎంలతో పాటు వివి ప్యాడ్లపై అవగాహన కల్పించారు. ప్రత్యేక వాహనాల ద్వారా మెటీరియల్‌తో పాటు సిబ్బందిని ఆయా పోలింగ్ సెంటర్లకు పంపించారు.
EVM Distribution For Lok Sabha Polling in Telangana : ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, జహీరాబాద్ రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. పోలింగ్ కోసం మెదక్ పార్లమెంట్‌కు 2వేల 124 కేంద్రాలు, జహీరాబాద్‌కు వెయ్యి 971 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల పరికరాలను ఇప్పటికే పంపిణీ చేశారు. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో ఈవీఎంలు పంపిణీ చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడు డీఆర్సీల వద్ద ఈవీఎంలు, వీవీ ప్యాట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లలో సిద్ధంగా ఉంచారు. ఉదయం వాటిని అధికారులకు ఎన్నికల అధికారులు అందించనున్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల సామగ్రి చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ క్రీడా మైదానంలో పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, డీసీపీ అశోక్ కుమార్, రిటర్నింగ్ అధికారి రాహుల్ పరిశీలించారు. సిబ్బందికి కల్పించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. పోలింగ్ రోజు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పల్ నియోజవర్గానికి సంబంధించిన డీఆర్సీ కేంద్రం రామంతాపూర్‌లోని ప్రభుత్వ కాళాశాలతో పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రానికి కేటాయించిన పోలీసులు ఇప్పటికే చేరుకుని విధులు నిర్వహిస్తున్నారు.
Polling Arrangements In Telangana : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు ఏర్పాటు చేసిన 176 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది ఓట్ల బ్యాలెట్లతో ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లారు. భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్ సామాగ్రిని అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధికార యంత్రాంగం సోమవారం జరగబోయే పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికల సామాగ్రిని అందజేశారు. వాహనాల్లో, సాయుధ బందోబస్తుతో వాటిని తరలించారు.