Telangana Congress MP Candidates List 2024 : కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తొలి జాబితాలో 4 సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 19న దిల్లీలో జరిగిన సీఈసీ సమావేశంలో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. మొత్తం 7 స్థానాలకు ఒక్కో పేరును రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసినా వాటిలో భువనగిరిపై ఏకాభిప్రాయం కుదరక పక్కనపెట్టారు. మిగిలిన ఆరు స్థానాలైన పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్‌లకు అభ్యర్థులను పార్టీ గురువారం అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.
Telangana Lok Sabha Elections 2024 : ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ స్థానాలకు మరో దఫా జరిగే సీఈసీ సమావేశంలో పేర్లను ఖరారు చేయనున్నారు. వీటిలో మెదక్, హైదరాబాద్ మినహా మిగిలిన ఐదింటికి పోటీ ఎక్కువగా ఉంది. భువనగిరి టికెట్‌ను మంత్రి కోమటిరెడ్డి సూచించిన వారికే ఇవ్వాలని మరో ఇద్దరు రాష్ట్ర నేతలు పట్టుబట్టడం వల్లనే ఈ నెల 19న జరిగిన సీఈసీ సమావేశంలో ఖరారు కాలేదని పార్టీ వర్గాల అంచనా. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన భార్యకే టికెట్ ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారు. టికెట్ తనకే దక్కుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు.
లోక్‌సభ పోరుకు కాంగ్రెస్ రెడీ - రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్న ఏఐసీసీ
T Congress Focus on MP Candidates : ఈ తరుణంలో కోమటిరెడ్డి కుటుంబానికి టికెట్ దక్కితే చామలతో పాటు, ఇతర నేతలు సహకరిస్తారా అనే చర్చ పార్టీలో సాగుతోంది. సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖరరెడ్డి భువనగిరి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. భువనగిరి అభ్యర్థిని ఖరారు చేయకుండా సీఈసీ పక్కనపెట్టింది. ఇక ఖమ్మం టికెట్ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డికే దాదాపు ఖరారు కావచ్చని అంచనా. ఈ టికెట్ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి భార్య నందిని సైతం దరఖాస్తు చేశారు. భట్టి సోదరుడు మల్లు రవికి నాగర్‌కర్నూల్ టికెట్ దాదాపు ఖరారైనందున అదే కుటుంబానికి మరో టికెట్ ఇవ్వకపోవచ్చని నేతలు చెబుతున్నారు.
రాష్ట్రంలో రోజురోజుకూ మారుతోన్న రాజకీయ పరిణామాలు - చేరికల తలుపులు తెరిచిన కాంగ్రెస్
Congress CEC Meeting : రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎస్సీలకు రిజర్వు అయినవి మూడు ఉన్నాయి. వీటిలో నాగర్‌కర్నూల్, పెద్దపల్లి టికెట్లను మాల వర్గానికి చెందినవారికి దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వరంగల్‌కు మాదిగ వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. పీసీసీ తరపున ఓ నేత పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మరింత బలమైన అభ్యర్థి కోసం అధిష్ఠానం అన్వేషిస్తోంది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నిజామాబాద్‌లో పోటీకి ఆసక్తి చూపుతున్నా ఆయనను కరీంనగర్ బరిలో దించాలనే చర్చ సాగుతోంది. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో పరిధిలో ఉన్నందున కరీంనగర్ ఎంపీ స్థానంపై ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది.
కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిపై పోటీ : కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో ఎవరిని ఎక్కడ నిలపాలనేది తేలక ఈ రెండింటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బీసీ కోటాలో నిజామాబాద్ ఎంపీ టికెట్ అడుగుతున్నట్లు తాజా సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ టికెట్ ఇస్తామని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డికి పార్టీ హామీ ఇచ్చినందువల్ల ఆయన పేరునే ఖరారు చేస్తారా లేక జీవన్‌రెడ్డిని గాని, మరొకరిని గాని సీఈసీ ఎంపిక చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
మెదక్ టికెట్‌ను బీసీకే ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. కానీ బలమైన అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. నాగర్‌కర్నూల్ లోక్‌సభ టికెట్ తనకే కేటాయించాలని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. తాను మాదిగ సామాజికవర్గానికి చెందిన వాడినని అక్కడి నుంచి కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని సంపత్ తన లేఖలో ప్రస్తావించారు.
కొలిక్కిరాని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ - ఆరు సీట్లపై ఏకాభిప్రాయం
నేడు కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా! - ఆశావహుల్లో ఉత్కంఠ