CM Revanth Gives Appointment orders to Irrigation AEE : నీటి పారుదల శాఖలో కొత్తగా చేరిన ఏఈఈలకు సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్ జలసౌధలో జరిగే కార్యక్రమంలో 700 మంది ఏఈఈలు నియామకపత్రాలు అందుకుంటారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సలహాదారులు, ఉన్నతాధికారులు, ఈఎన్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తగా 18 వందల లష్కర్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. అనంతరం ప్రాధాన్య ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇస్తారు.
కొత్తగా 6 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షిస్తారు. నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి సహా ఇతర ప్రాజెక్టుల్ని మంత్రులు తాజాగా సందర్శించి వచ్చారు. క్షేత్రస్థాయిలో పనుల వేగానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. నీటిపారుదల శాఖలో ఏఈ నుంచి ఈఎన్సీ వరకు అన్నిస్థాయుల ఇంజినీర్లను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
బీసీ కులగణన కోసం కార్యాచరణ ప్రారంభించండి : బీసీ కులగణన కోసం వెంటనే కార్యాచరణ ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు సచివాలయంలో బుధవారం సీఎంను కలిశారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధి విధానాలపై ముఖ్యమంత్రితో కమిషన్ ఛైర్మన్, సభ్యులు చర్చించారు. బీసీ కులగణన ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి విధానాలను పరిశీలించాలని సూచించారు. బీసీ కులగణన వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం రేవంత్ హామి ఇచ్చారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐ, పాలిటెక్నిక్‌ల సిలబస్ : సీఎం రేవంత్ - CM Revanth On Govt ITI