CM Revanth Reddy Delhi Tour : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజులపాటు దిల్లీ, జైపూర్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజులపాటు సీఎం పర్యటన ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్‌రెడ్డి దిల్లీ వెళ్లతారు. అక్కడ నుంచి జైపూర్ చేరుకుంటారు. బంధువుల వివాహానికి హాజరై తిరిగి దిల్లీ చేరుకుంటారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున కేంద్ర మంత్రులు దిల్లీలో అందుబాటులో ఉంటారు. దీంతో పలువురు మంత్రులను కలిసేందుకు అపాయిమెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా శాఖల నుంచి వివిధ పథకాలు, గ్రాంట్ల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల చేయాలని కేంద్రమంత్రులను విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.
మూడు రోజుల పర్యటనలో ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ కార్యవర్గం రూపకల్పనపై చర్చించే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దీప దాస్‌మున్షీలు కూడా దిల్లీలో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్న ఈ కోర్ కమిటీ సమావేశం తప్పనిసరని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీకి విధేయులుగా ఉండే నేతలకు కార్యనిర్వహక అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షుల పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు.
నామినేటెడ్ పదవుల ఆశావహుల పేర్ల జాబితా? : ఇక పెండింగ్ పెడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణపైనా ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సామాజిక సమీకరణాలు కుదరకపోవడం, మంత్రి పదవులకు ఎక్కువ పోటీ ఉండడంతో ముందుకు పోలేని పరిస్థితులు నెలకొన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. నామినేటెడ్ పదవులు 25వరకు భర్తీ చేసేందుకు ఆశావహుల పేర్లతో జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గతంలోనూ మొదటి విడతలో ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు ఓ వర్గానికి అధికంగా ఇచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.
ఈసారి అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీకి విధేయులుగా పని చేసిన వారికి ఏఐసీసీ, పీసీసీల నుంచి హామీలు పొందిన నాయకుల ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ మూడు కూడా నెలాఖరు నాటికి పూర్తి చేసే అవకాశం ఉంది. ఏఐసీసీ నుంచి కూడా ఒత్తిడి ఉండటంతో మరోసారి వాయిదా పడే అవకాశం లేదని చెప్పవచ్చు.
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు - సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్