Telangana CM Revanth Reddy Chit Chat : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు (Musi Revival Project Works Begins)పై ముందడుగే కానీ, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే వెయ్యి సార్లు ఆలోచిస్తామని, నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నవంబర్ 1న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్న సీఎం.. బాపూఘాట్ నుంచి పనులు స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఇష్టాగోష్టిగా ఆయన మాట్లాడారు.
అభ్యంతరాలను తెలియజేయవచ్చు : ఈ సందర్భంగా నవంబర్‌లోపు మూసీ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకూ సిద్ధమని సవాల్ విసిరారు. మూసీ పునరుజ్జీవంపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్న ఆయన, బీఆర్‌ఎస్ వాళ్లు తమ అభ్యంతరాలను తెలియజేయాలని అన్నారు. తనను కలవటం అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చని, విపక్షాలు ప్రతిపాదనలు సూచించవచ్చని స్పష్టం చేశారు.
కొందరి మెదళ్లలో మూసీ మురికి కంటే ఎక్కువ విషం - అందుకే దుష్ప్రచారం: రేవంత్‌రెడ్డి
నా కల నెరవేరింది : ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కొనసాగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు చెప్పారు. విచారణ విషయంలో కక్షసాధింపు ఉండదని, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరతామని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం అవ్వాలనుకున్న తన కల నెరవేరిందన్న రేవంత్ రెడ్డి, ఈ పదవి కంటే పెద్ద కలలు తనకు వేరే ఏమీ లేవని అన్నారు.
హైదరాబాద్ నుంచే 65 శాతం ఆదాయం : మూసీ పునరుజ్జీవంపై కావాలనే చర్చకు తెరలేపానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ చర్చతో ప్రజలకు అవగాహన కలిగిందని తెలిపారు. మూసీని బాగు చేసేవాడొకడు వచ్చాడని ప్రజలకు తెలిసిందని అన్నారు. తాను ఫుట్‌బాల్ ప్లేయర్‌నని, గేమ్ ప్లాన్‌పై తనకు పూర్తి స్పష్టత ఉందని వెల్లడించారు. 55 కి.మీ. మూసీ పునరుజ్జీవం పూర్తి అయితే అద్భుత నగరం ఆవిష్కృతమవుతుందని, పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే 65 శాతం ఆదాయం వస్తోందని, మరింత పెంచుతామని వివరించారు.
తెలంగాణలో మూసీ ప్రక్షాళన - నిర్మాణాల తొలగింపునకు రంగం సిద్ధం - MUSI RIVER RE SURVEY
కేటీఆర్‌కు మూసీని ఎలా బాగు చేయాలో తెలియదా? : మూసీ కోసం భూములు ఇచ్చే వారికి 100 శాతం సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. మూసీ కోసం ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోమని ప్రకటించారు. మూసీ ప్రాజెక్టును ఎన్జీవోలు వ్యతిరేకిస్తే అర్థం ఉందని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు. కేటీఆర్ ప్రపంచ స్థాయి మేధావినని అనుకుంటారని, మూసీని బాగు చేసే అంశంలో కేటీఆర్ తన ఆలోచనలు చెప్పొచ్చని సూచించారు. అంతర్జాతీయ అవగాహన ఉన్న కేటీఆర్‌కు మూసీని ఎలా బాగు చేయాలో తెలియదా? మూసీ పునరుజ్జీవంపై కేటీఆర్ నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నామని అన్నారు. మూసీపై కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల తమ ప్రతిపాదనలు తెలపాలని స్పష్టం చేశారు.