TG CM Revanth on Telugu States Development : బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందన్నారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకు ఆసుపత్రిని నిర్మించారని తెలిపారు. హైదరాబాద్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, డా.నోరి దత్రాత్రేయుడు హాజరయ్యారు.
Basavatarakam Indo American Cancer Hospital 24th Anniversary : ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందన్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. శంషాబాద్లో 500-1000 ఎకరాల్లో హబ్ ఏర్పాటుకు యోచన చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే హెల్త్ టూరిజం హబ్లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయిస్తామని వెల్లడించారు. బసవతారకం సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని అనుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
చంద్రబాబులాగా 18 గంటలు పని చేయాలి : చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు 18 గంటలు పని చేసి, తాను 12 గంటలు పని చేస్తే సరిపోదని అన్నారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
బసవతారకం ఆసుపత్రి సేవలు మరింత విస్తరిస్తాం : క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తోందని బసవతారకం మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం ముఖ్యమంత్రి సహకారం కోరామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కోరిన వెంటనే అంగీకారం తెలిపారని వివరించారు. దాతల సహకారంతో ఆసుపత్రి నేడు ఈ స్థాయికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రి సేవలను మరింత విస్తరిస్తామని బాలకృష్ణ తెలిపారు.
మంగళగిరిలో బసవతారకం ఇండో- అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఉచిత నిర్ధారణ శిబిరం