Telangana CEO Vikas Raj on Lok Sabha Polling Arrangements 2024 : లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతేడాది నవంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన కేంద్రాల్లోనే ఓటు వేయవేచ్చని పేర్కొన్నారు. శనివారం ఈటీవీ భారత్‌తో మాట్లాడిన ఆయన ఎన్నికల గురించి మరిన్ని విషయాలు పంచుకున్నారు.
ఈవీఎంలను కేటాయించేందుకు త్వరలో ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలు ఉండగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు 25 నియోజకవర్గాలకు సంబంధించి వ్యాజ్యాలు దాఖలయ్యాయని, వాటిలో 20 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను వినియోగించుకునేందుకు న్యాయస్థానం, ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించిందని వివరించారు. మిగిలిన ఐదింటి విషయంలో స్పష్టత రాలేదని చెప్పారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ పూర్తి కానుందన్న ఆయన ఆ సమయాన్ని పెంచాలని రాజకీయ పార్టీల నుంచి వినతులు వచ్చాయని వాటిని ఎన్నికల సంఘానికి పంపినట్లు వెల్లడించారు.
ఎన్నికల వేళ రాష్ట్రానికి చేరుకున్న బలగాలు: రాష్ట్రానికి ఎన్నికల కారణంగా 155 కంపెనీల సాయుధ బలగాలు వచ్చాయని మరో 50 కంపెనీలను కేటాయించాలని కోరినట్లు వివరించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 375 కంపెనీల బలగాలు వచ్చాయని తెలిపారు. ఈ దఫా దేశవ్యాప్తంగా వివిధ దశల్లో పోలింగ్ జరగనుండటంతో వాటి సంఖ్య తగ్గిందని చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న 60 వేల యూనిఫాం సర్వీసు ఉద్యోగులతోపాటు పక్క రాష్ట్రాల నుంచి 20 వేల పోలీసు బలగాలు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే సాయుధ బలగాలు ఉన్నాయని ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అక్కడి లోక్‌సభ స్థానాలకు రెండు దశల పోలింగ్ పూర్తి అయిందని, ఆ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.
" రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు స్పష్టం చేశాం. షామియానాలు వేయాలని సూచించాం. అందుబాటులో ఉంటే కూలర్లు లేని పక్షంలో పెడస్టల్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని చెప్పాం. రాష్ట్రం మొత్తం మీద 500 వరకు మోడల్ పోలింగ్ కేంద్రాలు, ట్రాన్స్‌జెండర్ల కోసం ఓ మోడల్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం’’ - వికాస్ రాజ్, తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తేదీలు ఖరారు కాలేదు : లోక్‌సభ ఎన్నికల్లో 2.80 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకునేందుకు నమోదు చేసుకున్నారని, వారిలో 80 శాతం మంది సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు మూడు రోజులు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి వచ్చే నెల 5, 6, 7 తేదీలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం అనుమతితో ఆ తేదీలను త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఫెసిలిటీ సెంటర్‌లో ఓటేయవచ్చని, అందరూ ఒకే రోజు వెళితే ఇతర పనులకు ఇబ్బంది వస్తుందని పేర్కొన్నారు.
అందుకోసమే మూడు రోజుల వ్యవధి నిర్ణయించినట్లు తెలిపారు. వారు ఓటు వేసేందుకు ఎంచుకున్న రోజున ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. ఇంటి నుంచి ఓటు వేసేందుకు 24,974 మంది ఎంచుకున్నారని, వారిలో 11,238 మంది 85 సంవత్సరాలు దాటిన వారు కాగా, 11,904 మంది దివ్యాంగులు, 1,832 మంది వివిధ సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు ఉన్నారని వివరించారు.
రాష్ట్రంలో 9.14 లక్షల ఓట్ల తొలగింపు : సీఈఓ వికాస్‌రాజ్ - LOK SABHA ELECTIONs 2024
ఈ ఎన్నికల్లోనూ 'హోమ్ ఓటింగ్'కు అవకాశం - రోడ్ షోలకు ముందస్తు అనుమతి తప్పనిసరి : వికాస్‌రాజ్