TG MLC Swearing Ceremony : ఇటీవల జరిగిన నల్గొండ, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన తీన్మార్ మల్లన్న, నవీన్ కుమార్‌రెడ్డిలు శాసనమండలిలోకి అడుగుపెట్టారు. ఇవాళ వీరిరువురితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. తీన్మార్ మల్లన్న ప్రమాణస్వీకారానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక విజేత తీన్మార్ మల్లన్న - Telangana Graduate Mlc By Election Results 2024
పాలమారు కేసీఆర్ అడ్డా : పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డా కాదు, కేసీఆర్ అడ్డానని తన గెలుపుతో నిరూపించారని మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఈయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. తెలంగాణ అమరవీరులకు తన విజయం అంకితమని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో తనను గెలిపించి, ఇది కేసీఆర్ అడ్డా అని పాలమూరు ప్రజలు మరోమారు నిరూపించారని వ్యాఖ్యానించారు. 420 హామీలు చెప్పి అమలు చేయని కాంగ్రెస్ పార్టీ తీరు చూసి తనను గెలిపించారని అన్నారు.
తీన్మార్ మల్లన్న విజయం.. నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అక్కడి స్థానం ఖాళీ అయ్యింది. ఎన్నికల కమిషన్ ఉపఎన్నిక షెడ్యూల్ జారీచేసింది. ఈఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో అభ్యర్థి గెలుపునకు 1,55,095 ఓట్లు కావాలి. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తంగా 3,10,189 ఓట్లు పోల్‌కాగా, 25,824 ఇన్‌వ్యాలిడ్ ఓట్లు నమోదయ్యాయి.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ్యునిగా ఎన్నిక కాగా, ఆయన రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై, బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి ఘనవిజయం సాధించారు. మార్చి 28న పోలింగ్ జరగ్గా, 1439 ఓటర్లకు గానూ 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కౌంటింగ్‌లో భాగంగా పోలైన ఓట్లను సరిచూసుకుని చెల్లుబాటు కాని ఓట్లను వేరుచేశారు. 21 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. చెల్లుబాటైన 1416 ఓట్ల ఆధారంగా 709 ఓట్లను కోటాగా గుర్తించారు. అనంతరం మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కించారు. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్ధి నవీన్‌కుమార్ రెడ్డి 709 కంటే అధికంగా 762 ఓట్లు సాధించి విజయాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డికి 653 ఓట్లు వచ్చాయి.