2 Employees Washed Away in Stream at Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు శుక్రవారం సాయంత్రం వాగులో కొట్టుకుపోయారు. వివరాల్లోకి వెళ్తే పాచిపెంట మండలం సరాయివలస గ్రామంలోని ఏకలవ్య పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు సమీపంలోని ఒట్టిగడ్డలో కొట్టుకుపోయిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. కొట్టుకుపోయిన వారు ఉపాధ్యాయురాలు ఆర్తి, వార్డెన్ మహేశ్‌గా గుర్తించారు.
ముమ్మరంగా గాలింపు చర్యలు: 45 రోజుల కిత్రం హరియాణా రాష్ట్రానికి చెందిన ఆర్తి (23), మహేశ్ ఇక్కడికి వచ్చారు. వీరు గురివినాయుడుపేటలో ఉంటూ పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. రోజూ మాదిరిగానే విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలోని రాయిమాను వాగు పొంగి ప్రవహిస్తుండటంతో నీరు కాజ్‌వేపైకి చేరింది. స్థానికులు వీరిని గమనించి, వెనక్కి వెళ్లిపోవాలని అరిచారు. అయితే భాష అర్థంకాక ముందుకు రావడంతో వారిద్దరూ కొట్టుకుపోయారు. కొంతసేపటికి ఆర్తి మృతదేహం లభ్యమైంది. మహేశ్ ఓ చెట్టుకొమ్మను పట్టుకొని, ఒడ్డుకు చేరే ప్రయత్నం చేయగా కొమ్మ విరిగిపోవడంతో నదిలో పడి గల్లంతయ్యాడు.
మహేశ్ కోసం రెవెన్యూ, పోలీస్ అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా అతని ఆచూకీ తెలియలేదు. ఉద్యోగులు గల్లంతుపై మంత్రి సంధ్యారాణి ఆరా తీశారు. తక్షణమే మహేశ్ మృతదేహం కోసం వాగులో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శనివారం ఉదయం వాగు వద్ద వార్డెన్ మహేశ్ మృతదేహాన్ని గుర్తించారు.