Teacher Teaching Innovative Way in Hanamkonda : హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మైమరిపించే విధంగా ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్లతో కనివిందు చేస్తోంది. విద్యార్థులకు సులభమైన పద్ధతిలో అర్థం చేసుకునే విధంగా గోడలపై వివిధ రకాల బొమ్మలను వేసి తద్వారా పాఠాలను బోధిస్తున్నారు ఉపాధ్యాయులు. ఒకప్పుడు కొద్ది మందితో అరకొర వసతులతో ఉన్న పాఠశాలను 2018 సంవత్సరంలో బదిలీపై వచ్చిన అచ్చ సుదర్శన్ అనే ఉపాధ్యాయుడు పాఠశాల స్థితి గతులను మార్చేశాడు. ఇంటింటికి మైకు పట్టుకుని తిరగడం గ్రామంలో బుర్రకథ చెప్పించడం లాంటి ఎన్నో ప్రయత్నాలు చేసి విద్యార్థులను పాఠశాలలో చేర్పించాడు.
విద్యార్థులను చేర్పించడమే కాకుండా వారికి సామాజిక, ఆర్థిక వ్యవస్థలపై చిన్నతనం నుంచి అలవాటు చేయాలనే ఉద్దేశంతో వినూత్న రీతిలో పాఠాలను బోధిస్తున్నారు. విద్యార్థుల మానసిక స్థితికి అనుగుణంగా అనేక రకాలుగా బోధిస్తూ ఉండడం ఉపాధ్యాయుడు సుదర్శన్ ప్రత్యేకత. పిల్లలకు పాఠశాల ఆవరణలోనే మినీ బ్యాంకును ఏర్పాటు చేసి వారికి అకౌంట్ బుక్కులు ఇచ్చి బ్యాంకులో పొదుపు ప్రక్రియ ఎలా కొనసాగుతుందో నేర్పిస్తున్నారు. చిన్నారులతో ఆటలు ఆడించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను అబ్బురపరుస్తున్నారు.
స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా సకల సదుపాయాలు ఉన్నాయని తద్వారా పిల్లలు బడికి ఉత్సాహంగా వెళ్తున్నారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సహకారంతో సకల సౌకర్యాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్ చెబుతున్నారు. విద్యార్థులను బాల్య దశలోనే మానసికంగా దృఢంగా చేయడం లక్ష్యమని అందుకు వినూత్న రీతిలో విద్యను అభ్యసిస్తున్నట్లు పేర్కొన్నారు.