TDP YSRCP Clashes in YSR Kadapa District: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ కొనసాగుతున్న వేళ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుల ఆగడాలు మితిమీరి పోయాయి. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో వైఎస్సార్సీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను వైఎస్సార్సీపీ నాయకులు బయటకు లాగేశారు. గుంపులుగా వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ ఏజెంట్‌పై దాడిచేసి బయటికి లాగి పడేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల దాడిలో టీడీపీ ఏజెంట్ ఉగ్ర నరసింహులుకు తీవ్రగాయాలు అయ్యాయి.
వైఎస్సార్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను బయటకు లాగి కొట్టడంపై ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వారి అనుచరులు దౌర్జన్యకాండ పెరిగిపోతుందని ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దలవాయిపల్లె గ్రామంలో పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఎన్నికల అధికారులు కొత్త ఈవీఎం ఏర్పాటు చేసి ఎన్నికలు మళ్లీ కొనసాగించారు.
అదే విధంగా వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం కోగటంలో ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు కూర్చునే సమయంలో తెలుగుదేశం నాయకులు ఎక్కువగా ఉన్నారంటూ వైఎస్సార్సీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. దీనిపై ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు ఇరు పార్టీల నాయకులకు సర్దిచెప్పారు. ఎవరైనా గొడవలకు దిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వైఎస్సార్సీపీ నాయకుల కవ్వింపు చర్యలు: ప్రొద్దుటూరు మండలం కామనూరులో వైఎస్సార్సీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడి కుమారుడు రాఘవేంద్రారెడ్డి, ఆయన బామ్మర్ది బంగారు మునిరెడ్డి కుమారుడు విజయముని రెడ్డిలు ఏజెంట్ ఫారం లేకుండా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. దీనిపై టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి అనుచరులు అభ్యంతరం తెలిపారు. దీంతో బయటికి వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు వరదరాజుల రెడ్డి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసుల ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.
ఎనిమిది ద్విచక్ర వాహనాలను ధ్వంసం: మైదుకూరు, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు ఏజెంట్లను లక్ష్యంగా చేసుకొని వైఎస్సార్సీపీ అల్లరి ముకలు దాడులకు పాల్పడ్డాయి. రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం చౌటుపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. పోలింగ్ కేంద్ర వద్దే ఘటన జరిగింది. టీడీపీకి చెందిన ఎనిమిది ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చెందిన ఏజెంట్‌పై, వాహనంపై దాడి చేశారు. మైదుకూరు నియోజకవర్గంలో వరస దాడులు సాగాయి.
టీడీపీ ఏజెంట్లపై దాడి: ఉమ్మడి కడప జిల్లా కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం పాపక్కగారిపల్లెలో టీడీపీ ఏజెంట్లపై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారు. టీడీపీ ఏజెంట్లపై వైసీపీ నాయకులు విచక్షణా రహితంగా దాడి చేసి అందులో సుభాష్ రెడ్డి అనే తెలుగుదేశం నాయకుడిని ఊరి బయట పడేశారు.అతనిని రాజంపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంబంధిత పోలింగ్ స్టేషన్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలతో చేరుకున్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, ఓటింగ్ ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
కుప్పంలో వైఎస్సార్సీపీ అరాచకం - పోలింగ్ బూత్ తలుపులు మూసిన భరత్ - YSRCP Attack on TDP Agents
ఓటు వేసిన ప్రముఖులు: బాకరపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్ వివేకా కుటుంబసభ్యులు కూడా ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అటు కడప పార్లమెంట్ అభ్యర్థి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని మల్లేలమ్మపల్లి తండాలోని పోలింగ్ కేంద్రంలో భర్త అనిల్ కుమార్‌తో కలిసి వచ్చి ఓటు వేశారు.