TDP Prathipati Pulla Rao Visit Tidco Houses: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గృహనిర్మాణాల్లో తాము టాప్-1 స్థానంలో చిలకలూరిపేట నియోజకవర్గాన్ని నిలిపితే, మంత్రి విడదల రజిని (Vidadala Rajini) అన్నివిధాల అధోగతి పాల్జేశారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. తమ హయాంలో చిలకలూరిపేటలో అత్యంత వేగంగా యుద్ధ ప్రాతిపదికన 4 వేల512 టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్న ప్రత్తిపాటి, రాజకీయ పార్టీలకు అతీతంగా, దళారులు జోక్యం లేకుండా లాటరీ పద్ధతిలో నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించడం జరిగిందన్నారు.
తెలుగుదేశం పార్టీ తరఫున సెల్ఫీ ఛాలెంజ్ టు జగన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాటి పుల్లారావు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన వేలాది ఇళ్ల సముదాయం వద్ద జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులతో కలిసి ఆయన సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల సముదాయంలో అన్ని వసతులు ఆనాడే కల్పించామని, కేవలం విద్యుత్ సరఫరా ఒకటే పెండింగ్‌లో ఉందన్నారు. అలాంటి పరిస్థితి నుంచి వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా 500 కుటుంబాలు కూడా ఇళ్లలోకి చేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అరకొర వసతులతో టిడ్కో ఇళ్లు పంపిణీ- తీవ్ర అవస్థలు, అనారోగ్యం ఇక్కట్లతో ప్రజలు
దీంతో టిడ్కో ఇళ్ల సముదాయం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందన్నారు. నాడు స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను ప్రత్యేక చొరవ తీసుకుని మహానగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో గృహ సముదాయం చేపట్టామన్నారు. అలాంటిది గత ఎన్నికల్లో మొహం తెలియకపోయినా ఓట్లేశారని, ఎమ్మెల్యే, మంత్రి అయిన తర్వాతేమో విడదల రజిని చిలకలూరిపేటను లూటీ చేశారని విమర్శించారు.
జగన్‌రెడ్డి ఏమో రూపాయకే ఇల్లంటూ మోసం చేసి బ్యాంకు వాళ్లనేమో ఇళ్లకు పంపిస్తున్నాడని మండిపడ్డారు. ఇళ్ల కేటాయింపులోనూ అక్రమాలకు పాల్పడ్డారన్నారని మండిపడ్డారు. సింగిల్ బెడ్‌రూమ్ వాళ్లకు డబుల్ బెడ్‌రూమ్, డబుల్ బెడ్‌రూమ్ వాళ్లకు సింగిల్ బెడ్‌రూమ్‌లు కట్టబెట్టారన్నారు. 4 వేల 512 ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తే చాలా మందికి అద్దె భారం తగ్గేదన్నారు. టిడ్కో ఇళ్ల సముదాయాన్ని గంజాయి, మద్యం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇల్లు దక్కేనా - కల నెరవేరేనా - టిడ్కో లబ్ధిదారుల ఆవేదన
దీని కారణంగానే మంత్రి రజిని ఆరు నెలల ముందే చిలకలూరిపేట నుంచి గుంటూరు పారిపోయారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం- జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. చిలకలూరిపేట నుంచి టిడ్కో ఇళ్ల సముదాయానికి డబుల్ లైన్ రోడ్ నిర్మిస్తామన్నారు. ఇళ్లకు రక్షణ ఉందనేలా పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడా లేని రక్షణ ఇక్కడ ఉండేలా వాతావరణం సృష్టిస్తామన్నారు.
అదే విధంగా మిగిలిపోయిన రెండు వేల ఇళ్ల నిర్మాణాలను సైతం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రి, పాఠశాలతో పాటు ఇతర సౌకర్యాలు సమకూరుస్తామని చెప్పారు. మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అష్టకష్టాలు పడుతున్న టిడ్కో లబ్ధిదారులు - చేతులెత్తేసిన వైఎస్ జగన్ సర్కారు