TDP Leaders Visit Nallamilli Ramakrishna Reddy House: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి తెలుగుదేశం సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, గన్ని కృష్ణ, టీడీపీ జోన్-2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు వచ్చి నల్లమిల్లి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అనపర్తి సీటును బీజేపీకి ప్రకటించడంతో నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల్లో అధిష్ఠానం తిరిగి తనకు సీటు ఇవ్వాలని అప్పటివరకు వేచి చూస్తానని రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
ఈ పరిస్థితుల్లో ఆయనని బుజ్జగించేందుకు టీడీపీ సీనియర్ నేతలు అనపర్తి మండలం రామవరంలోని రామకృష్ణారెడ్డి ఇంటికి వచ్చారు. రామకృష్ణారెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను బుజ్జగించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి తల్లి సత్యవతి, భార్య మహాలక్ష్మి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకొని విలపించారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్త దివంగత మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు 42 ఏళ్లుగా టీడీపీకి సేవలందించామని పార్టీ కోసం ఎంతగానో కృషి చేశామని, తన కుమారుడికి ప్రకటించిన సీటును అకస్మాత్తుగా బీజేపీకి కేటాయించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రామకృష్ణారెడ్డి సతీమణి మహాలక్ష్మి కూడా కన్నీటి పర్యంతమయ్యారు. అన్యాయం చేయకుండా తెలుగుదేశానికే అనపర్తి సీటుని కేటాయించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు వారికి పరిస్థితి వివరించారు.
బుజ్జగింపులు అనంతరం బయటకు వచ్చిన టీడీపీ నేతలను పార్టీ శ్రేణులు నిలదీశారు. అనపర్తి టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేతలు ముందు బైఠాయించి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని కొనసాగించాలంటూ నినదించారు. ఈ సందర్భంగా టీడీపీ జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ అనపర్తి సీటు ఆర్థిక బలహీనతల వల్ల, టీడీపీ బలహీనతల వలనో బీజేపీకి ఇవ్వలేదన్నారు. అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనని, అందులో భాగంగానే మొదటి లిస్టులోనే ఆయన పేరు ఖరారు చేశారన్నారు.
అయితే కూటమిలో బీజేపీ చేరిన అనంతరం వారు అనపర్తిని అడిగారని, అయితే అనపర్తి సీటు తెలుగుదేశానికే ఉండాలని చంద్రబాబు కూడా ప్రయత్నించారన్నారు. బీజేపీ నేతలు కూడా అనపర్తి సీటు తీసుకునేందుకు సుముఖత చూపలేదని టీడీపీకే వదిలేస్తామని వారు చెప్పడం జరిగిందన్నారు. కానీ దానికి భిన్నంగా బీజేపీ అధిష్ఠానం అనపర్తి నియోజకవర్గం పేరును ప్రకటించిందన్నారు. రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గంలో టీడీపీని బలపరిచి విజయం సాధించే దిశగా ముందుకు తీసుకువెళ్లారన్న విషయం చంద్రబాబుకు తెలుసని, అయితే అనపర్తి నియోజకవర్గ టీడీపీ టికెట్ సమస్య పరిష్కార దిశగా చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. రామకృష్ణారెడ్డి వద్దకు టీడీపీ అధిష్ఠానం తనను పంపిందన్నారు.
టీడీపీ కార్యకర్తల మనోభావాలు స్వయంగా చూడటం జరిగిందని, తెలుగుదేశం కార్యకర్తల, రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల పరిస్థితిని చంద్రబాబు వద్దకు తీసుకొని వెళ్లి మరోసారి తెలియజేస్తానని అన్నారు. అనపర్తిలో టీడీపీ బలంగా ఉన్న నేపథ్యంలో, బీజేపీ మరో సీటు తీసుకునే విధంగా చంద్రబాబు కృషి చేస్తారని తెలిపారు. రెండు రోజుల పాటు కార్యకర్తలు సహనంగా ఉండాలని, ఒక మంచి వార్త వినే అవకాశం ఉందని, అందరూ సమన్వయంతో ఉండాలని సూచించారు. అనపర్తి సీటు విషయంలో రామకృష్ణారెడ్డికి తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు.
అనపర్తి బరిలో బీజేపీ - టీడీపీ నేత నల్లమిల్లి అనుచరుల ఆందోళన - POLITICAL TENSION IN ANAPARTHI