TDP Leaders Election Campaign in AP : ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలతో దూసుకెళ్తుండగా పార్లమెంట్, నియోజకవర్గ అభ్యర్థులు సైతం ప్రచార జోరు పెంచారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికీ తిరుగుతూ హామీల జల్లు కురిపిస్తున్నారు.
Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో ఎన్డీఏ అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. నరసన్నపేట తెలుగుదేశం అభ్యర్థి రమణమూర్తి సొంత నియోజకవర్గంతోపాటు జలుమూరులో జనసేన, బీజేపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. మూడు పార్టీల నేతలు బైక్ ర్యాలీ చేశారు. విజయనగరం జిల్లాలో కూటమి అభ్యర్ధులు ప్రచార జోరు పెంచారు. రాజాం నియోజకవర్గం అంతకాపల్లి, మొగిలివలసలో ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఎన్నికల ప్రచారానికి భారీ స్పందన లభించింది. మహిళలు మంగళ హారతులు, పూల వర్షంతో స్వాగతం పలికారు. 'సూపర్ సిక్స్' (super Six Schemes) పథకాలను ప్రజలకు వివరిస్తూ మురళి పర్యటన సాగించారు. డెంకాడ మండలం చొల్లంగిపేటలో నెల్లిమర్ల కూటమి అభ్యర్ధి లోకం మాధవి ప్రచారం నిర్వహించారు. కొత్తవలస మండలం చిన్నారావుపల్లిలో ఎస్.కోట తెలుగుదేశం అభ్యర్ధి కోళ్ల లలిత కుమారి ఇంటింటి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నెల్లిమర్ల వైసీపీ అభ్యర్ధి అప్పలనాయుడు పూసపాటిరేగ మండలంలోని అనేక గ్రామాల్లో ప్రచారం చేశారు.
రాష్ట్రంలో జోరందుకున్న ప్రచారం - హామీలు ఇస్తున్న పార్టీలు - All Parties Election Campaign
Anakapalli : ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ సింహాచలంలో అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి ర్యాలీగా అనకాపల్లి చేరుకున్నారు. సీఎం రమేష్‌కు అనకాపల్లి జిల్లాలో అయ్యన్నపాత్రుడు, కొణతాల రామకృష్ణ ఘనస్వాగతం పలికారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. వైసీపీ పాలనా వైఫల్యాలను నేతలు ఎండగట్టారు. కూటమి అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షిస్తామని షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చారు.
Prakasam : ప్రకాశం జిల్లా ఒంగోలులోతెలుగుదేశం అభ్యర్ధి దామచర్ల జనార్దన్ తరపున మహిళలు ప్రచారం చేపట్టారు. జనార్దన్ భార్య నాగ సత్యలత ఆధ్వర్యంలో గుండాయపాలెంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సుజాత నగర్, ఇందిరానగర్‌లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓ వైపు ప్రచార జోష్ కొనసాగుతుండగా మరోవైపు తెలుగుదేశంలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. మార్కాపురం నియోజకవర్గంలో 200 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. కందుల నారాయణరెడ్డి కండువా కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. గిద్దలూరులో వైసీపీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ బేటీకి ముఖ్య అతిథిలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అన్నా రాంబాబు, నాగార్జున రెడ్డి, బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు భారీ ర్యాలీ చేపట్టారు. వాస్తవానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఈసీ ఆదేశాల ప్రకారం 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఉన్నా 100 వాహనాలతో ర్యాలీ నిర్వహించి నిబంధనలు తుంగలో తొక్కారు.
జోరుగా టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం - గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల వ్యూహం - Election Campaign In AP
Anantapur : అనంతపురం జిల్లా ఉరవకొండ పదో వార్డులో 'బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమంలో పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం కోగటంలో తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నర్సింహారెడ్డి, తెలుగుదేశం అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి వీధుల్లో తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.
Tirupati District : తిరుపతిలో నిర్వహించిన బీజేపీ, జనసేన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్, జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. జగన్ దళిత ద్రోహి అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని ఇంటికి సాగనంపి కూటమిని గెలిపించేందుకు శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఏ.ఎస్ పేట ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం దర్గా సెంటర్ నుంచి ప్రజాగళం సభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ చేపట్టడంతో రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఆత్మకూరులో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదని నేతలు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఉమ్మడి అభ్యర్థుల పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రాక్షసుడి పరిపాలన అంతం చేయడానికే పొత్తులని నేతలు స్పష్టం చేశారు.