TDP Leaders Devineni Uma Varla Ramaiah Meet DGP : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ సరిగ్గా అమలు చేయడం లేదంటూ మాజీమంత్రి దేవినేని ఉమ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి కి ఫిర్యాదు చేశారు. జగన్ ఓటమి భయంతోనే ఏదేదో మాట్లాడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయం పై దాడి చేసిన అవినాష్, అప్పిరెడ్డిలతో సహా చంద్రబాబు నివాసం మీదకు వచ్చిన జోగి రమేష్‌పై కేసులు, చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. జగన్ ఘోరంగా, నీచంగా మాట్లాడుతున్నా నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు.
టీడీపీ అభ్యర్థులపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు తెలియజేయలని డీజీపీ రాజేంద్రనాథరెడ్డిని మాజీ మంత్రి దేవినేని ఉమ, వర్ల రామయ్య కోరారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఆ సమాచారం సేకరించడం కష్టమని, స్టేట్ క్రైం రికార్డు బ్యూరో నుంచి వివరాలు తెప్పించి ఇవ్వవలసిందిగా చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా చాలా మంది పోలీసులు వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని డీజీపీకి వివరించారు. ఈ మేరకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలోని డీజీపీ క్యాంపు కార్యాలయంలో రాజేంద్రనాథరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. టీడీపీ అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను వీలైనంత త్వరగా ఇస్తామని డీజీపీ తెలిపినట్టు నేతలు వెల్లడించారు.
నందిగామలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ వర్గీయులు హత్యాయత్నం చేస్తే నిందితులపై పోలీసులు తేలికపాటి సెక్షన్లు పెట్టారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో దాడి జరిగినా పట్టించుకోలేదని విమర్శించారు. 2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగితే నిందితుల్లో ఒక్కర్ని ఇప్పటికీ అరెస్టు చేయలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని డీజీపీని కోరినట్టు వర్ల తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది పెద్ద తలకాయలకూ బదిలీలు తప్ప వని హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పోలీసుల సమక్షంలోనే ఓటర్లకు తాయిలాలు పంచుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.