TDP Leader Anam Venkata Ramana Reddy Comments: ప్రజలకు సేవ చేద్దామన్న ధ్యాస వైసీపీ నాయకులకు లేదని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. అందిన వరకూ దోచుకోవడమే వైసీపీ నేతల పని ప్రజలకు సేవ చేయడం తెలియదని దుయ్యబట్టారు. ఎంపీ విజయసాయికి ఏం తెలుసని వేమిరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు.
కుల, మతాలకు అతీతంగా సేవ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సప్లయ్ చేసిన నాసిరకం మద్యం వల్ల ఎంతమంది చనిపోయారో లెక్కేలేదని విమర్శించారు. దొంగ సారాతో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు క్షమాపణ చెప్పి విజయసాయి రెడ్డి ఓటు అడగాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డికి, బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్‌కు కచ్చితంగా సంబంధం ఉందని తెలిపారు.
విజయసాయి రెడ్డి ఓ ఆర్థిక ఉగ్రవాది: విజయసాయి రెడ్ది ఓ ఆర్ధిక ఉగ్రవాది అని, రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోపిడీలో ముద్దాయి అని ఆరోపించారు. అందుకే జైలుకి వెళ్లారని తెలిపారు. విజయ సాయిరెడ్డికి వ్యాపారాలు లేవంటే నెల్లూరు ప్రజల నమ్మరని అన్నారు. తాను సేవ చేశాను అంటూ విజయసాయి రెడ్ది చెప్పడం ఒట్టి బూటకమని దుయ్యబట్టారు.
మీ కంపెనీలు ఎలా అభివృద్ది చెందాయి- అలాగే, రాష్ట్ర ఆదాయాన్ని పెంచొచ్చుగా జగన్: ఆనం
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది నెల్లూరులోని ప్రతి నియోజకవర్గంలో సేవ చేసినట్లు, ఖర్చు చేసిన ఆధారాలు ఉన్నాయని ఆనం తెలిపారు. ఎంపీ లాడ్స్ నిధులు పదేళ్లలో యాభై కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి అయిన విజయసాయి రెడ్డి ఖర్చు చేశారా అని ఆనం ప్రశ్నించారు. నెల్లూరు బిడ్డ వేమిరెడ్డి మాత్రమే అని, విజయసాయి రెడ్ది కాదు అని స్పష్టం చేశారు. వేమిరెడ్డి కులమతాలకు అతీతంగా విద్యా, వైద్యం, తాగు నీరు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. 2.16 కోట్ల రూపాయలతో తిరుమల దేవస్థానంకి క్యాన్సర్ వైద్యం కోసం వాహనం కొనిచ్చానని అన్నారు.
శ్రీశైలంలో రూ. 12 కోట్లతో రథం బహుకరించిన సేవామూర్తి వేమిరెడ్డి అని కొనియాడారు. చర్చి, మసీదు, ఆలయాలకు ఆర్ధిక సహాయమందించి సేవ కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. విజయసాయి రెడ్ది మద్యం కంపెనీ వలన రాష్ట్రం నాశనం అయిందని విమర్శించారు. నకిలీ మద్యంతో రాష్ట్ర మహిళల తాళి తెంచారని, అందుకు సాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలని ఆ తరువాతే నెల్లూరులో ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు.
సాయిరెడ్డి దొంగా అని వాళ్లే చెప్పారు: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వాళ్లే సాయిరెడ్డి దొంగా అని చెప్పారని విమర్శించారు. సాయిరెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉండేందుకు అర్హుడు కాదని తేల్చి చెప్పారని గుర్తు చేశారు. విశాఖకు వచ్చిన కంటైయిర్తో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందని ఆరోపించారు. గతంలో బ్రెజిల్ అధ్యక్షుడుకి ఎందుకు శుభాకాంక్షలు పెట్టారని నిలదీశారు. బ్రెజిల్‌కి, సాయిరెడ్డికి ఏం సంబంధాలు ఉన్నాయని ప్రశ్నించారు. విశాఖను దోచుకున్నట్లే నెల్లూరు జిల్లాను దోచేందుకు వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆనం సూచించారు.
ముఖ్యమంత్రి జగన్‌కు ముగ్గురు ముద్దుబిడ్డలు : ఆనం వెంకటరమణారెడ్డి