TDP Janasena BJP Contesting Seats in Andhra Pradesh : ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు ముగింపు దశకు చేరుకున్నాయి. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, నర్సాపురం, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుండగా, కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో జనసేన బరిలోకి దిగనుంది. మిగతా 17 లోక్‌సభ స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేయనుంది.
చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో, ఏయే సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. దిల్లీ నుంచి వచ్చిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండాలతో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు దిల్లీ నుంచి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులే పూర్తి చేశారు. వారి దగ్గరున్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి ఖరారు చేశారు.
ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ - సీట్ల సర్దుబాటుపై కుదిరిన అవగాహన
చర్చల్లో కుదిరిన అవగాహన మేరకు రాజమహేంద్రవరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజు పోటీ దాదాపు ఖరారైంది. మిగతా నాలుగు స్థానాలకు బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. నేడు బీజేపీ ప్రకటించే రెండో విడత లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతో పాటు మరో నాలుగు స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది.
పూర్తి స్పష్టతతోనే మంతనాలు: దిల్లీలో హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఈ నెల 7, 9 తేదీల్లో రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో జనసేన(Jana Sena) , బీజేపీలకు కలిపి 30 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించాలని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. బీజేపీ 6, జనసేన 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలన్న నిర్ణయం అప్పుడే జరిగింది. సోమవారం ప్రధానంగా అసెంబ్లీ స్థానాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు రెండంకెల స్థానాలు కావాలని, కనీసం పది సీట్లయినా లేకపోతే ఇబ్బందవుతుందని బీజేపీ నాయకులు గట్టిగా పట్టుబట్టినట్టు తెలిసింది. తమకు ఏయే స్థానాలు కావాలన్న విషయంలోనూ వారు పూర్తి స్పష్టతతో చర్చల్లో పాల్గొన్నట్లు సమాచారం.
ఏపీలో ఎన్నికలు ఏకపక్షమే - టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది- చంద్రబాబు
ఈ నెల 14న రెండో జాబితా విడుదల: 25 అసెంబ్లీ స్థానాల్ని, 10 లోక్‌సభ సీట్లను ముందే ఎంపిక చేసుకున్న బీజేపీ నాయకులు (BJP) వాటిలోంచే 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ సీట్లు కావాలని కోరారు. సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మిత్రపక్షం బీజేపీ కోసం జనసేన మూడు అసెంబ్లీ స్థానాల్ని వదులుకోవడానికి సిద్ధపడగా, మరో అసెంబ్లీ సీటు ఇవ్వడానికి తెలుగుదేశం అంగీకరించింది. ఇప్పటికే టీడీపీ-94, జనసేన-5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాయి. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను ఈ నెల 14న ప్రకటించనుంది. అదే రోజు లోక్‌సభ అభ్యర్థుల్ని కూడా ప్రకటించే అవకాశముంది. మొత్తం అభ్యర్థుల్ని ప్రకటిస్తుందా?, మూడో జాబితా కూడా ఉంటుందా? అన్న అంశంపై స్పష్టత రావలసి ఉంది.
Jana Sena, TDP, BJP Alliance : బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు టీడీపీ, జనసేనలతో తదుపరి చర్చల నిమిత్తం షెకావత్, పండా ఆదివారం విజయవాడకు చేరుకున్నారు. నగరంలోని ఒక హోటల్లో బీజేపీ రాష్ట్ర నాయకులతోనూ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తోనూ (Jana Sena Pawan Kalyan) విస్తృతంగా చర్చలు జరిపారు. బీజేపీ, జనసేన పోటీ చేసే స్థానాలపై ఆ రెండు పార్టీలు ప్రాథమిక అవగాహనకు వచ్చారు. ఆ తర్వాత రెండు పార్టీల నాయకులు తమ ప్రతిపాదనలతో సోమవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏ సమయమైనా సీట్ల సర్దుబాటు కొలిక్కి తేవాలన్న ఉద్దేశంతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల15 నిమిషాల వరకు చర్చలు జరిగాయి.
కొలిక్కి వచ్చిన సీట్ల వ్యవహారం - జనసేన, బీజేపీకి 8 ఎంపీ, 31 అసెంబ్లీ సీట్లు
చర్చలో పాల్గొనని లోకేశ్ : అనంతరం షెకావత్, పండా చంద్రబాబు నివాసం నుంచి బయల్దేరారు. వారు వెళ్లిన తర్వాత చంద్రబాబు, పవన్ మధ్య మరో అరగంట పాటు చర్చలు సాగాయి. అనంతరం పవన్ నిష్క్రమించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు, కొందరు టీడీపీ (TDP) ఎమ్మెల్యేలు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మనోహర్ తదితరులు చంద్రబాబు నివాసానికి వెళ్లినా చర్చల్లో పాల్గొనలేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తాడిపత్రిలో శంఖారావం సభ ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నా, ఆయన కూడా చర్చల్లో పాల్గొనలేదు.
ఈ నెల 17న టీడీపీ-జనసేన మేనిఫెస్టో - ఏపీ భవిత కోసమే అంటూ నేతల వెల్లడి