TDP Confidence on Victory in AP Elections: ఎన్నికల పోలింగ్‌కు వివిధ వర్గాల ప్రజలు రాత్రి 10 గంటల వరకూ క్యూలైన్లలో బారులు తీరి ఓటేయడం, యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం, ఇతర రాష్ట్రాల నుంచి ఆరు లక్షలకుపైగా ఓటర్లు తరలి రావడం వంటి పరిణామాలు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. ఓటింగ్ 80 శాతం దాటుతుందనే అంచనాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు దర్పణమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నాయి. ఎన్డీఏ కూటమికి కనీసం 130 నుంచి 140 అసెంబ్లీ సీట్లు, 23 వరకు లోక్‌సభ స్థానాలు రావడం ఖాయమని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళి ఎన్డీఏ పక్షాలకు అనుకూలంగా ఉందని వస్తున్న వార్తలతో టీడీపీ శిబిరంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
గతానికంటే భిన్నం: ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణ, ప్రచారశైలిలో ప్రతి దశలోనూ అధికారపార్టీపై ఎన్డీఏ పైచేయి సాధించిందని, ఓటింగ్ సరళి కూడా దానికి అద్దం పట్టిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలు, అస్తవ్యస్త విధానాలపై టీడీపీ అలుపెరగని పోరాటం చేయడం, ‘బాదుడే బాదుడు’ వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల్ని తీవ్రంగా ఎండగట్టడం, లోకేశ్ యువగళం పాదయాత్ర, పార్టీ అధినేత చంద్రబాబు మండుటెండల్లోను అలుపెరగకుండా చేసిన ప్రచారం వంటివి సానుకూల ఫలితాలనిచ్చాయని విశ్లేషిస్తున్నాయి.
సరైన సమయంలో జనసేన, బీజేపీలతో జట్టుకట్టడం, సీట్ల సర్దుబాటు ప్రక్రియను సాఫీగా పూర్తిచేయడం, గతానికంటే భిన్నంగా టీడీపీ చాలా ముందుగా మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించడం బాగా కలిసివచ్చిందని కూటమి శ్రేణులు భావిస్తున్నాయి. ప్రభుత్వంపై ఉద్యోగ, వ్యాపార వర్గాల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి వంటివి ఎన్డీఏకు భారీ విజయాన్ని కట్టబెట్టబోతున్నాయని అంచనాలు వేస్తున్నాయి.
హామీలు ప్రజల్లోకి బలంగా: టీడీపీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా బీజేపీ అగ్రనేతలూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతోపాటు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, అరాచకాలను తీవ్రంగా ఎండగట్టడం వంటివి ప్రజలపై విస్తృత ప్రభావం చూపాయన్న భావన వ్యక్తమవుతోంది.
భారీగా నమోదైన ఓటింగ్ శాతం - అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో జనం - andhra pradesh elections 2024
ఆ రెండు స్థానాలూ గాజుగ్లాస్ ఖాతాలో: జనసేన కూడా మంచి ఫలితాలు వస్తాయని ధీమాగా ఉంది. పోటీ చేసిన 21 స్థానాల్లో 18 చోట్ల గెలుస్తామని, మరో 3చోట్ల గట్టి పోటీ ఉంటుందని భావిస్తోంది. ఇక లోక్‌సభకు పోటీ చేసిన రెండు స్థానాలూ గాజుగ్లాస్ ఖాతాలో పడతాయనే విశ్వాసం ప్రదర్శిస్తోంది. మచిలీపట్నం నియోజకవర్గంలో పూర్తి అనుకూలంగా ఓటింగ్ జరిగినా, కాకినాడ లోక్‌సభ స్థానంలో కొంత క్రాస్ ఓటింగ్ జరిగిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పవన్‌కు పిఠాపురంలో ఎంత మెజారిటీ వస్తుందనేదే ఇప్పుడు చర్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. నాదెండ్ల మనోహర్ కూడా తెనాలిలో కచ్చితంగా గెలుస్తారనే అంచనాతో పార్టీ ఉంది.
ఆశాజనకంగా కమలనాథులు: ఇక కూటమి మరో మిత్రపక్షమైన బీజేపీ కూడా విజయంపై ధీమాగా ఉంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, మిత్రపక్షాల నుంచి అందిన సంపూర్ణ సహకారంతో ఓటర్ల నుంచి పూర్తి మద్దతు వచ్చిందని, కమలం పార్టీ భావిస్తోంది. విశాఖ నార్త్, కైకలూరు, విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయావకాశాలు మెరుగుపరుచుకున్నారని, కాపుల ఓట్లతో అనపర్తిలో నల్లమిల్లి గెలవడం ఖాయమనే ధీమాగా ఉంది. ఇతర స్థానాల్లోనూ పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఆశాజనకంగానే ఉందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు.
మరోవైపు అధికార వైఎస్సార్సీపీ క్రమంగా నేలకు దిగుతున్నట్లే కనిపిస్తోంది. పోలింగ్ ముందు వరకూ వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైఎస్సార్సీపీ ఇప్పుడు 110 నుంచి 120 సీట్లతో గెలుస్తామంటూ అంచనాలు తెగ్గోసుకుంది. అందులో ఇంకొంత తగ్గినా ప్రభుత్వాన్నైతే ఏర్పాటు చేస్తామంటూ ఓటింగ్ సరళిని బట్టి ఆ పార్టీ నేతలు విశ్లేషించుకుంటున్నారు. వాలంటీర్లు పూర్తిగా సహకరించారని, యువతలో అభిమానం కొంచెం తగ్గినట్లు కనిపించినా, మొత్తంగా సానుకూలంగానే ఉటుందని విశ్లేషించుకుంటున్నారు.