TDP Complaint to EC on Pension: కదల్లేని పెన్షన్ దారులను వైసీపీ నేతలు మంచాల్లో ఊరేగించడాన్ని తెలుగుదేశం సీరియస్‌గా తీసుకుంది. కదల్లేని వాళ్లకు ఇళ్ల వద్దే పెన్షన్ ఇవ్వాలనే నిబంధనలున్నా, వైసీపీ నేతలు ప్రచారం కోసం వృద్ధులను ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ మండిపడింది. వైసీపీ (YCP) నేతల అకృత్యాలపై ఈసీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయనుంది. సామాజిక మాధ్యమాల్లో తమపై విష ప్రచారం చేసేందుకు వైసీపీ నేతలు అరేంజ్డ్ వీడియోలు తీస్తున్నారని ఈసీ దృష్టికి తెలుగుదేశం తీసుకెళ్లనుంది.
ఎన్నికల సంఘానికి లేఖ రాసిన టీడీపీ: వైసీపీ కార్యకర్తలు మంచం పై వృద్ధులను మోసుకు వస్తూ ఈసీ ఆదేశాలు ధిక్కరిస్తూ ఉంటే అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) మండిపడ్డారు. పింఛన్లపై ఇప్పటికీ నగదు సచివాలయంలోకి అందలేదని లేఖ ద్వారా ఎన్నికల సంఘానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వెంటనే నగదు విడుదల చేసి ఇళ్ళ వద్ద పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని టీడీపీ తరపున డిమాండ్ చేశారు.
వైసీపీ నేతలపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్: ఫించన్ల కోసం వృద్ధుల్ని ఇబ్బంది పెట్టడంలో అసలు కుట్రదారులు సీఎస్ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సీఈవో మురళీధర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ధనుంజయ్ రెడ్డి అని తెలుగుదేశం నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వృద్ధులను మంచాలపై ఊరేగిస్తూ, ప్రతిపక్షాలపై విషప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం వైసీపీ నేతలు, అధికారులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కుట్రలో భాగస్వాములైన 9మంది అధికారులపై ఈసీ (election commission) చర్యలు తీసుకున్నా, మిగిలిన అధికారుల్లో మార్పు రాదా అని నిలదీశారు. అస్మదీయులకు ఖజానాను దోచిపెట్టడం వల్లే ఈనాటికీ ఫించన్ డబ్బు బ్యాంకుల్లో జమ కాలేదని ధ్వజమెత్తారు.
మరోసారి నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు : కోడికత్తి, వివేకా హత్య కేసు, పింక్ డైమండ్ లాగానే ఇప్పుడు పెన్షన్లని శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్యలు ధ్వజమెత్తారు. అధికారుల్ని అడ్డం పెట్టుకుని పెన్షన్ దారులపై జగన్ కుట్రలు చేస్తున్నారని నేతలు ఆరోపించారు. ఒకసారి నమ్మి మోసపోయారు. మరోసారి నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. చంద్రబాబు ఐదేళ్లలో 1800 పెంచితే జగన్ రెడ్డి పెంచింది వెయ్యి మాత్రమేనని తెలిపారు. జగన్ పాలనలో ధరల బాదుడు, పన్నుల వాత, ఛార్జీల మోత తప్ప సంక్షేమం ఎక్కడ అని నిలదీశారు. గతంలో మద్యం షాపుల ముందు టీచర్లు, వీఆర్వోలను, సినిమా హాళ్ల దగ్గర ఎమ్మార్వో, ఆర్డీవోలను పెట్టారని నేతలు విమర్శించారు. వాలంటీర్లు లేకపోతే సచివాలయ సిబ్బంది, ఇతర సిబ్బందితో ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ఈ రోజు పెన్షన్ల పంపిణీ ఉందని తెలిసినా సచివాయాల్లో నగదు ఎందుకు అందుబాటులో లేదని నిలదీశారు.
చివరికి అనుకున్నదే సాధించారు - అవ్వాతాతలను ఎండలో నిలబెట్టారు! - Door To Door Pension Distribution