TDP Candidates Third List: బీసీలకే అగ్రతాంబూలం అంటూ తెలుగుదేశం వరుసగా మూడో జాబితాను 11 మంది అసెంబ్లీ, 13మందిని పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటించేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 144అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమై, మిగిలిన 31స్థానాల్లో జనసేన, భాజపాలతో పొత్తు కుదుర్చుకున్న తెలుగుదేశం మరో అయిదు చోట్ల మాత్రమే అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. 17ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తూ మిగిలిన 8స్థానాలు మిత్రపక్షాలకు ప్రకటించిన తెలుగుదేశం 4స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల్ని పెండింగ్ లో పెట్టింది. ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటించని అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని కోరిన చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరామని పునరుద్ఘాటించారు. పార్లమెంటులో బలమైన గళం వినిపిస్తూ, రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే తెలుగుదేశం అభ్యర్థులుగా నిలబెట్టామని స్పష్టం చేశారు.
టీడీపీలో తీవ్ర పోటీ - పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులు వీరేనా ! - TDP Pending Seats
తెలుగుదేశం అధినేత చంద్రబాబు 24మంది అభ్యర్థులతో మూడో జాబితాను ప్రకటించారు. ఇందులో 11మంది అసెంబ్లీ, 13మంది పార్లమెంట్ స్థానాల అభ్యర్థులున్నారు. 3వ జాబితాలోని 24మంది అభ్యర్థుల్లో 11మంది బీసీలకు తెదేపా చోటు కల్పించింది. బీసీ నేతలు రామ్మోహన్ నాయుడు, పుట్టా మహేష్ యాదవ్, బీకే పార్థసారథి, నాగరాజు, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, గొండు శంకర్, కోళ్ల లలితకుమారి, వనమాడి వెంకటేశ్వవరావు, చదలవాడ అరవిందబాబు, కొండయ్య యాదవ్‌లు అవకాశం దక్కించుకున్నారు. మొత్తంగా మరో 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ కలిపి ఇంకా 9 మంది అభ్యర్థుల్ని మాత్రమే తెలుగుదేశం ప్రకటించాల్సి ఉంది.
ఎంపీ స్థానాలకు సంబంధించి కడప, అనంతపురం, ఒంగోలు, విజయనగరం లేదా రాజంపేట స్థానాలకు అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించాల్సి ఉంది. కడపకు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి రేసులో ఉండగా, వైఎస్ వివేకా హత్య సెంటిమెంట్ దృష్ట్యా ఈ సీటుపై కాస్త వేచి చూసే ధోరణిలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. ఒంగోలు స్థానానికి- మాగుంట శ్రీనివాసుల రెడ్డి లేదా ఆయన తనయుడు రాఘవరెడ్డి మధ్య పోటీకి ఎవర్ని దింపాలనే సందిగ్థత కొనసాగుతోంది. అనంతపురం పార్లమెంట్ స్థానానికి జేసీ పవన్ రెడ్డి కొత్తగా తెర మీదకు రాగా, బీసీ అయితే సాఫ్ట్వేర్ సంస్థ అధినేత నాగరాజు పేరు పరిశీలనలో ఉంది. పొత్తులో భాగంగా విజయనగరం పార్లమెంట్ స్థానం తొలుత భాజపాకు అనుకున్నా, ఉత్తరాంధ్రలో పక్కపక్కనే ఉన్న మరో నాలుగు పార్లమెంటు స్థానాలైన అరకు, అనకాపల్లి, నర్సాపురం, రాజమండ్రిల్లో కూడా భాజపా పోటీ చేస్తున్నందున విజయనగరం బదులు రాయలసీమలో రాజంపేట భాజపాకు కేటాయించే అవకాశం ఉంది.
విజయనగరం పార్లమెంట్ తెలుగుదేశం తీసుకుంటే, తూర్పు కాపు సామాజిక వర్గం కర్రోతు బంగారు రాజు, గేదెల శ్రీనులు పోటీ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తాజాగా ప్రకటించిన 13 మంది ఎంపీల్లో నలుగురు బీసీలకు అవకాశం కల్పించారు. విశ్రాంత అఖిలభారత సర్వీస్ అధికారుల్లో ఇద్దరికి అవకాశం కల్పించగా ఇద్దరు వైద్యులున్నారు. పీజీ చదివిన వారు ముగ్గురు ఉంటే ఆరుగురు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 35ఏళ్ల లోపు యువతకు ఇద్దరికి అవకాశం కల్పించగా, 36నుంచి 45ఏళ్ల లోపు వారు అయిదుగురు ఉన్నారు. 46ఏళ్ల నుంచి 60ఏళ్ల లోపు వారు ఇద్దరున్నారు. 61-75ఏళ్ల మధ్య వారు నలుగురు అభ్యర్థులున్నారు.
13మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం
1. శ్రీకాకుళం - రామ్మోహన్ నాయుడు, (బీసీ)
2. విశాఖ - ఎం. భరత్
3. అమలాపురం - గంటి హరీష్(ఎస్.సి)
4. ఏలూరు - పుట్టా మహేష్ యాదవ్ (బీసీ)
5. విజయవాడ - కేశినేని శివనాథ్ (చిన్ని)
6. గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్
7. నరసరావుపేట - లావు శ్రీకృష్ణదేవరాయులు
8. బాపట్ల - కృష్ణప్రసాద్(ఎస్సీ)
9. నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
10. చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్(ఎస్.సి)
11. హిందూపురం - బీకే పార్థసారథి (బీసీ)
12. కర్నూల్ - నాగరాజు (బీసీ)
13. నంద్యాల - బైరెడ్డి శబరి
ఇవాళ ప్రకటించిన 11మంది అసెంబ్లీ అభ్యర్థుల్లో ఏడుగురు బీసీలకు తెలుగుదేశం అవకాశం కల్పించింది. సీనియర్లు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు మరో జాబితా కోసం వేచి చూడాల్సి ఉండగా, సోమిరెడ్డి, గౌతు శిరీష, కోళ్ల లలిత కుమారి, వనమాడి వెంకటేశ్వరరావు నిరీక్షణకు తెరపడింది. సూపర్ సీనియర్ నేతలుగా పేరొందిన దేవినేని ఉమా, బండారు సత్యనారాయణమూర్తి, ఆలపాటి రాజాలకు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్న దారులన్నీ దాదాపు మూసుకుపోయినట్లైంది. వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన గుమ్మనూరు జయరాం తెలుగుదేశం నేతల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నందున ఆయన కూడా తదుపరి జాబితా కోసం వేచి చూడక తప్పట్లేదు.
తెలుగుదేశం ఇంకా ప్రకటించాల్సిన 5 అసెంబ్లీ స్థానాల్లో భీమిలీ, చీపురుపల్లికి సంబంధించి సీనియర్ నేతలు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావులు చెరొక స్థానంలో పోటీ చేసే అవకాశం ఉంది. దర్శి స్థానానికి ఓ మాజీమంత్రి లేదా ఆయన కోడలు పోటీ చేయవచ్చని తెలుస్తోంది. ఆలూరు, గుంతకల్లు స్థానాల్లోనూ తెలుగుదేశం పోటీ చేయవచ్చని అంచనా. ఆలూరుకు వైకుంఠం కుటుంబంలో ఒకరు లేదా వీరభద్రగౌడ్ ల మధ్య పోటీ నెలకొంది. గుంతకల్లు స్థానానికి మాజీమంత్రి గుమ్మనూరు జయరాం పేరు పరిశీలనలో ఉంది.
తాజా 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల్లో ఎంబీబీఎస్ చదివిన వైద్యులు ఒకరు కాగా, పీజీ చదివిన వారు ముగ్గురు ఉన్నారు. ఇద్దరు గ్రాడ్యుయేట్లు ఉంటే, ఇంటర్మీడియట్ చదివిన వారు ఇదరు, అంతకంటే తక్కువ చదివిన వారు ముగ్గురు ఉన్నారు. 45ఏళ్ల లోపు వారు ఇద్దరు ఉండగా 46-60ఏళ్ల మధ్యవారు ఆరుగురు ఉన్నారు. 61-75ఏళ్ల మధ్యలో ముగ్గురు ఉన్నారు.
మరో 11మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం
1. పలాస - గౌతు శిరీష (బీసీ)
2. పాతపట్నం - మామిడి గోవిందరావు (బీసీ)
3. శ్రీకాకుళం - గొండు శంకర్ (బీసీ)
4. ఎస్.కోట - కోళ్ల లలితకుమారి (బీసీ)
5. కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వవరావు (బీసీ)
6. నరసరావుపేట - చదలవాడ అరవిందబాబు (బీసీ)
7. చీరాల - కొండయ్య యాదవ్ (బీసీ)
8. అమలాపురం- అయితాబత్తుల ఆనందరావు
9. పెనమలూరు -బోడె ప్రసాద్
10. మైలవరం - వసంతకృష్ణప్రసాద్
11. సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
పొత్తులో భాగంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భాజపాలకు ఏయే పార్లమెంట్ స్థానాల్లో ఎవరు పోటీ చేసేదీ స్పష్టత రాగా, 20 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో భాజపా పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలపై స్పష్టత వస్తే పెండింగ్‌లో ఉన్న అయిదేసి అసెంబ్లీ స్థానాల్లో తమ తమ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు తెలుగుదేశం-జనసేన సిద్ధంగా ఉన్నాయి.