Chandrababu Naidu Meeting With Women: రాష్ట్రాన్ని బాగుచేయడమే తన ఆలోచన అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఆడపిల్లలను చదివించి, నైపుణ్యం పెంచితే ప్రపంచాన్ని శాసించేస్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా వేదికపై కేకు కోసిన చంద్రబాబు, అనంతరం మాట్లాడారు.
రాష్ట్రంలో సున్నా పేదరికం చేయడమే జీవిత ఆశయం: ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌వన్‌గా ఉండాలన్నదే నా కోరిక అన్న చంద్రబాబు, ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా చేయడం కోసం కృషి చేస్తానని తెలిపారు. అందరిని మోసం చేసి ఒక్కడే ఉండాలనుకునే వ్యక్తి జగన్ అని, రాష్ట్రంలో జగన్ పాలనలో ఎక్కడి చూసినా కుంభకోణాలే అని మండిపడ్డారు. రాష్ట్రంలో సున్నా పేదరికం చేయడమే తన జీవిత ఆశయం అన్న చంద్రబాబు, సృష్టించిన సంపద పేదవారికి ఇవ్వకుండా దోచుకుంటున్నారని విమర్శించారు.
ప్రజల గుండెల్లో స్థానమే నా ఆశయం: మహిళల్లో చాలా చైతన్యం ఉందన్న చంద్రబాబు, మెుదటిసారి ఆడపిల్లలను చదివించాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనయాడారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఉందని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ప్రజల గుండెల్లో స్థానమే తన అశయమన్న చంద్రబాబు, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పేదల కోసం పనిచేశానని అన్నారు. ఆడపిల్లలను చదివిస్తే ఆర్థికాభివృద్ధి సాధిస్తారని, తెలుగుజాతి నెంబర్‌వన్‌గా నిలపాలన్నది తన లక్ష్యం అని పేర్కొన్నారు. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని మండిపడ్డారు. కుంభకోణాలు జరిగితే ప్రజలంతా బానిసలుగా ఉండాల్సి వస్తుందన్న చంద్రబాబు, టీడీపీ అధకారంలోకి వచ్చాక పేదరిక నిర్మూలనకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
దీపం కింద వంటగ్యాస్ ఇస్తే దాన్ని ఆర్పేశారు: మహిళల చదువు కోసం వర్సిటీ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపిన చంద్రబాబు, మహిళలకు అధికారం ఇవ్వాలన్న ఉద్దేశంతో డ్వాక్రా గ్రూపులు ప్రవేశపెట్టానని అన్నారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చామని గుర్తు చేశారు. మహిళలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. దీపం కింద వంటగ్యాస్ ఇస్తే దాన్ని వైసీపీ హయాంలో ఆర్పేశారని ధ్వజమెత్తారు. జగన్ రూ.10 ఇచ్చి రూ.100 బాదేస్తున్నారని విమర్శించారు.
సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు తెలిపారు. వైసీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర ధరలు అన్నీ పెరిగాయని ఆరోపించారు. ఇచ్చేదాని కంటే దోచుకునేదే ఎక్కువ అని మండిపడ్డారు. గూడూరులో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి ముగిసిన అనంతరం, నెల్లూరు జిల్లా పొదలకూరుకు చంద్రబాబు బయల్దేరి వెళ్లారు.