TDP Central Office Attack Case Handed Over TO CID : తెలుగుదేశం కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులను సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విచారణ వేగంగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుల్ని విచారిస్తున్న తాడేపల్లి, మంగళగిరి పోలీసులకు పని ఒత్తిడి కారణంగా విచారణలో జాప్యం జరుగుతోంది. పైగా ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో స్థానిక పోలీసులకు అక్కడకు వెళ్లిరావడం ఇబ్బంది అవుతోంది. వీటి దృష్ట్యా విచారణ సజావుగా, వేగంగా జరిగేందుకు సీఐడీకి అప్పగించింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రెండు ప్రధాన ఘటనలకు సంబంధించిన కేసుల్ని కూటమి ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. 2021 సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు నివాసంపైకి జోగి రమేష్ తన అనుచరులతో కలిసి దాడికి వెళ్లారు. అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై దాడికి తెగబడ్డారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఇరు వర్గాల పైనా కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలపై SC అట్రాసిటీ సెక్షన్లు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు, వైఎస్సార్సీపీ వారి జోలికి వెళ్లలేదు. అలాగే మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న వైఎస్సార్సీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. ఈ ఘటనపై మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 70 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు ఎఫ్‌ఐఆర్ నమోదైనా కేసు విచారణ ముందుకు సాగలేదు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు కేసుల విచారణ మొదలైంది. టీడీపీ కార్యాలయం దాడి కేసుని మంగళగిరి గ్రామీణ పోలీసులు విచారిస్తున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌తోపాటు 25 మంది వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్‌ను విచారించారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసుని విచారిస్తున్న తాడేపల్లి పోలీసులు మాజీమంత్రి జోగి రమేష్ తోపాటు పలువురిని విచారించారు. కొందరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అయితే కేసుల విచారణ అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు.
తాడేపల్లి, మంగళగిరి పోలీసులకు ఇతర కేసులతో పాటు బందోబస్తు విధులు ఎక్కువగా ఉంటున్నాయి. రాజధాని ప్రాంతం కావడం తరచుగా ఏవో కార్యక్రమాలు, ప్రముఖల పర్యటనలతో సరిపోతోంది. ఈ రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు కావడంతో వారిని విచారణకు పిలిచినప్పుడు శాంతిభద్రతల సమస్య వస్తోంది. వారిని కలిసేందుకు పార్టీ కార్యకర్తలు వస్తుండటంతో ఎక్కువ మంది పోలీసులను విధుల కోసం కేటాయించడం ఇబ్బందవుతోంది. దీని వల్ల కేసుల విచారణ వేగంగా ముందుకు సాగడం లేదు. ఈ కారణాలతో 2 కేసులను సీఐడీకి బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది.
ఈ రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నది వైఎస్సార్సీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలే కావడంతో విచారణ సమగ్రంగా జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. పోలీసులు నిందితులను పట్టుకోవటం కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్, బెంగళూరుతోపాటు దిల్లీలోనూ కొందరు తలదాచుకున్నారు. వీరిని అరెస్టు చేసేందుకు అక్కడకు వెళ్లాలంటే పోలీసులు ఎస్పీ అనుమతి తీసుకోవాలి. వేరే ప్రాంతాలకు వెళ్లడం వారికి ఇబ్బందవుతోంది. పొరుగు రాష్ట్రాల్లో నిందితులను అరెస్టు చేస్తే అక్కడి కోర్టుల్లో హాజరుపరచి వారెంట్‌పై రాష్ట్రానికి తీసుకురావాలి. అలాగే వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు సూప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడంతో విచారణ కోసం పోలీసులు దిల్లీ వెళ్లాల్సి వస్తోంది. ప్రతిసారి విచారణకు సీఐ, ఎస్ఐ, లాయర్లు వెళ్లడం సాధ్యం కావడం లేదు. అదే సీఐడీకి కేసు అప్పగిస్తే వారు ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉంటుంది. నిధుల సమస్య రాదు.
గుంటూరు జిల్లా కేంద్రంలో విచారణ జరుగుతుంది కాబట్టి అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉంటారు. అందుకే సీఐడీకి కేసులు బదిలీ చేస్తే విచారణ సజావుగా, వేగంగా జరిగే అవకాశముందని సర్కారు భావించింది. స్థానిక పోలీసులతో చర్చించిన మీదట ఉన్నతాధికారులు ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించారు. అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం సీఐడీకి కేసుల విచారణ అప్పగించింది. పోలీసులు ఇప్పటికే ఈ రెండు కేసులపై విచారణ చాలా వరకు పూర్తి చేశారు. విచారణ ఇంకా వేగంగా జరగాలన్నా, వ్యవహారాన్ని కొలిక్కి తేవాలన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు సీఐడీకి కేసులు బదిలీతో ఇప్పటి వరకు జరిగిన విచారణ వివరాల్ని వారికి అందజేయాల్సి ఉంటుంది. మంగళగిరి సబ్ డివిజనల్ అధికారులు సోమవారం నాడు సీఐడీ అధికారులకు సంబంధిత ఫైళ్లను అందజేస్తారని సమాచారం.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - కీలక నిందితులుగా వైఎస్సార్సీపీ నేతలు - TDP Office Attack Case