Tax Evasion in Foreign Liquor Sales Scam Updates : హైదరాబాద్‌లోని టానిక్ మద్యం దుకాణం ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రత్యేకంగా వెసులుబాటు కల్పిస్తూ జీఓ ఇవ్వడంతో సర్కార్ ఆదాయానికి భారీగా గండి పడిందని ప్రభుత్వం అనుమానిస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖలను ఇప్పటికే ఆదేశించింది. 2016లో ఎలైట్ రూల్స్ పేరుతో ఇచ్చిన జీవో ద్వారా టానిక్ మద్యం దుకాణం ఏర్పాటైంది. దీనికి మూడేళ్లపాటు ప్రివిలేజ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించారు.
Tax Evasion Tonic Liquor Stores : రెండేళ్లకొకసారి మారే మద్యం పాలసీ ప్రకారం దుకాణాల ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేస్తారు. కానీ టానిక్ లిక్కర్ షాప్‌కు (Tonic Liquor Shops Case) మాత్రం ఐదు సంవత్సరాల పాటు గడువు ఇచ్చారు. సాధారణ మద్యం దుకాణం ఏర్పాటుకు 1.10 కోట్లు లైసెన్స్ ఫీజు ఉండగా, టానిక్ దుకాణానికి 1.25 కోట్లుగా నిర్ణయించారు. ఆ దుకాణానికి ఇచ్చిన లైసెన్స్ ఫీజు మొత్తానికి పది రెట్లు విలువైన మద్యం అమ్మకాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏడాదికి రూ.12.5 కోట్ల విలువైన మద్యం ఏలాంటి ప్రివిలేజ్ ఫీజులు లేకుండా అమ్ముకోవచ్చు.
2023లో కిక్కే కిక్కు - రూ.36వేల కోట్ల విలువైన మందు తాగేశారు
పది రెట్ల విలువకు మించి జరిగే మద్యం విక్రయాలపై 13.7 శాతం వరకు ప్రభుత్వానికి ప్రివిలేజ్ రుసుం చెల్లించాల్సి ఉంది. అయితే ఐదేళ్ల గడువు ముగిసినా అదే లైసెన్స్ ఫీజు కింద గడువు పొడిగించుకుంటూ వచ్చారు. దీని ప్రకారం ఎనిమిది సంవత్సరాల్లో ప్రివిలేజ్ ఫీజు లేకుండా వంద కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్మాలి. కానీ ఒక్క టానిక్ మద్యం దుకాణమే దాదాపు రూ.600ల కోట్ల విలువైన అమ్మకాలు జరిపినట్లు ఆబ్కారీశాఖ లెక్కలు కడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఎంత నష్టపోయిందన్న దానిపై అంచనాలు వేస్తోంది.
బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్న అధికారులు : ప్రతి రెండేళ్లకు వేలంపాట ద్వారా దుకాణం కేటాయిస్తే కనీసం రెండు వందల దరఖాస్తులు వస్తాయి. ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షల చొప్పున వచ్చినా రూ.4 కోట్ల వరకు సమకూరుతాయి. ఇదే లెక్కన ఎనిమిదేళ్లలో కనీసం రూ.16 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడి ఉండొచ్చని అబ్కారీశాఖ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కాలంలో జరిగిన మద్యం విక్రయాలపై ప్రివిలేజ్ చెల్లింపులు, దుకాణం రికార్డులు సక్రమంగా లేకపోవడంతో బ్యాంకు లావాదేవీలు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Tonic Liquor Scam Case updates : టానిక్ మద్యం దుకాణానికి అనుబంధంగా నడుస్తున్న తొమ్మిది క్యూ మద్యం దుకాణాలు (TS Foreign Liquor Sales Scam) కూడా ఎనిమిదేళ్లలో దాదాపు రూ.800 కోట్ల విలువైన అమ్మకాలు చేసినట్లు అంచనా అబ్కారీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి ఉల్లంఘనలు తేల్చేపనిలో దాదాపు పది మంది అధికారుల బృందం నిమగ్నమైనట్లు సమాచారం. మరో వారం లేదా పది రోజుల్లో దీనిపై ఎక్సైజ్ శాఖ సమగ్రమైన నివేదిక సిద్ధం చేసే అవకాశం ఉంది.
ఇదే టానిక్ దుకాణంలో మద్యంతోపాటు సాఫ్ట్‌డ్రింక్‌లు, ఇతరత్రా తినుబండారాల విక్రయాలకూ వెసులుబాటు ఉండటంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. క్రయవిక్రయాల్లో వ్యాట్, జీఎస్టీ పరిధిలోకి వచ్చేవేంటి? చెల్లింపులు సక్రమంగా జరిగాయా ఎగవేతకు గురయ్యాయా? అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
మద్యం దిగుమతి వెసులుబాటుతో ఎక్కడ్నుంచి చేసుకున్నారు? వ్యాట్ చెల్లింపును వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. భారీ మొత్తంలోనే ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన అధికారులు నష్టం ఏలా జరిగింది? అందులో న్యాయపరంగా వసూలు చేసుకోడానికి ఉన్న అవకాశాలేంటి? తదితర కోణాల్లో విశ్లేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రికార్డులు పూర్తిస్థాయిలో పరిశీలించాక వాణిజ్య పన్నుల శాఖ సమగ్రమైన నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది.
రాష్ట్రంలో వ్యాట్ చెల్లింపులపై ప్రచ్ఛన్న యుద్ధం - వాణిజ్య, ఎక్సైజ్ శాఖల మధ్య నెలకొన్న వైరం
విదేశీ మద్యం పేరుతో భారీగా 'పన్ను ఎగవేత' - సమగ్ర విచారణకు ప్రభుత్వ ఆదేశం