Table Tennis Player Vijaya Deepika Success Story : టేబుల్ టెన్నిస్ చిరుత లాంటి వేగం ఈ క్రీడలో అవసరం. తీక్షణమైన చూపు విలక్షణ ఆటతీరు ఉంటే తప్ప పతకాలు గెలవలేరు. అలాంటిది జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈ 14 ఏళ్ల అమ్మాయి జాతీయ స్థాయిలో 3 పతకాలు సాధించింది. నిరంతర ప్రయత్నంతో నిరాశకే నిరాశ పుట్టిస్తూ సాగిపోతోంది. క్రీడలపై మక్కువతో తన పరిస్థితికి అనుగుణంగా ఉండే పారా టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకుని తనదైన రీతిలో ప్రదర్శిస్తోంది.
ఈ అమ్మాయి పేరు గంగాపట్నం విజయ దీపిక. తల్లిదండ్రులు గంగాపట్నం విజయ భాస్కర రాజు, అరుణ. ప్రస్తుతం హైదరాబాద్‌లో డిఫెన్స్‌లో అకౌంట్స్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు తండ్రి భాస్కర రాజు. తల్లి అరుణ ప్రస్తుతం గృహిణి అయినా ఒకప్పుడు వెటరన్ టెన్నిస్ ప్లేయర్. దీంతో ఇంట్లో క్రీడా వాతావరణమే ఉండేది. సోదరుడు విజయ్ తేజ్ జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్‌గా కొనసాగుతూనే సంగీతం ఆల్బమ్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ దీపికకు క్రీడలపై మక్కువ పెరిగిందని చెబుతుంది.
పుట్టుకతోనే వచ్చిన ఆస్టియోజెనిసిస్ ఇంపర్‌ఫెక్టా అనే జెనిటికల్ డిసార్డర్‌తో బాధపడుతుంది దీపిక. అడుగు తీసి అడుగేస్తే ఏ ఎముక విరుగుతుందో తెలియని పరిస్థితిలో పెరుగుతుంది. కానీ ఆట అంటే ఇష్టం మాత్రం వదులుకోలేదు ఈ అమ్మాయి. వీల్ ఛైర్‌లో కూర్చోని టేబుల్ టెన్నిస్ ఆటలో సాధన చేసింది. 2024 ఫిబ్రవరిలో ఇండోర్‌లో జరిగిన జాతీయ స్థాయి ఛాంపియన్ షిప్ పోటీల్లో సత్తా చాటింది. 2 రజత పతకాలతో పాటు 1 కాంస్య పతకం సాధించింది.
కళ్లు లేకున్నా కలలు సాకారం- చదువులో రాణిస్తున్న లక్కీ మిరానీ సక్సెస్ స్టోరీ - Lucky Mirani story
వీల్ ఛైర్‌లో కూర్చోని విజయాలు : ఆటలోనే కాకుండా పాటలు పాడడం, చిత్రలేఖనంలోనూ మంచి ప్రతిభ కనబరుస్తోంది విజయ దీపిక. తనకు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కుటుంబం తనను కంటికి రెప్పలా కాపాడుతూ ఇబ్బందులు దరిచేరనీయడం లేదని, వారి వల్లే ఇదంతా సాధ్యమవుతోందంటోంది. అన్ని ఆటంకాలను ఈ చిన్న వయసులోనే దీపిక తట్టుకుని నిలబడడం చూసి తల్లి అరుణ మురిసిపోతోంది. ఆటల్లో తన సోదరి రాణించడం గర్వంగా ఉందని సోదరుడు విజయ్ తేజ చెబుతున్నారు.
వీల్ ఛైర్‌లో కూర్చోని విజయాలు సాధిస్తోంది విజయదీపిక. అదే పట్టుదలతో అక్టోబర్‌లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌కు సెలెక్ట్ అయ్యింది. అయితే విదేశాల్లో ఆడాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాదాపు రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతోందని, దానికి ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని విజయ దీపిక తండ్రి కోరుతున్నారు.
14 ఏళ్ల వయసులో 45 ఫ్రాక్చర్లు : ప్రస్తుతం దీపిక శిక్షణ తీసుకుంటున్న ఇన్‌స్పైర్ టేబుల్ టెన్నిస్ అకాడమీ ఆమెకు ఇంటర్నేషనల్ స్థాయి మ్యాట్‌పై ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారు. ఎప్పటికైనా తను దేశానికి గర్వకారణం అవుతుందని కోచ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులో జాతీయ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని చెబుతున్న విజయ దీపిక రాబోయే ఇంటర్నేషనల్ టోర్నమెంట్లోనూ సత్తా చాటుతానంటోంది. దాంతో పాటు తన జీవిత లక్ష్యాన్ని ఈ విధంగా వివరిస్తోంది.
14 ఏళ్ల వయసులో 45 ఫ్రాక్చర్లు. అయినా ఆటలో రాణించాలని విధితోనే పోరాడుతుంది విజయ దీపిక. గాజు గ్లాసు అంత సున్నితమైన శరీర నిర్మాణం ఉన్నా ఆ గాజు గ్లాసు తత్వాన్నే అలవర్చుకుంది ఈ అమ్మాయి. గాజు గ్లాసు పగిలేకొద్దీ పదునెక్కుతుంది. ఈమె కూడా ఫ్రాక్చర్లు అయ్యే కొద్దీ పతకాలు కొల్లగొడుతానంటూ దూసుకుపోయేందుకు సిద్ధమవుతోంది. అయితే ఆర్థిక పరిస్థితి విజయ దీపికకు కొత్త ఆటంకంగా మారింది.