Swamiji Agitation in Tirupati on Laddu Issue : తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాట పట్టారు. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యి కల్తీపై ఏపీ, తెలంగాణ సాధు పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు సాధువులు ఆందోళనకు దిగారు. సేవ్ తిరుమల- సేవ్ తిరుపతి ప్లకార్డులు ప్రదర్శిస్తూ గోవింద నామ స్మరణలు చేశారు. తర్వాత ఈవోను కలిసి వినతిపత్రం సమర్పించారు. జగన్ పాలనలో తిరుమల ప్రతిష్టను దిగజార్చారని సాధువులు ధ్వజమెత్తారు.
హిందూ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అన్యమతస్థులను తొలగించాలని సాధువులు డిమాండ్ చేశారు. తిరుమలలో అక్రమాలకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని గత పాలకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తిరుమల లడ్డూ వ్యవహారం - ఏఆర్ ఫుడ్స్‌కు కేంద్రం నోటీసులు - Tirupati Laddu Ghee Controversy
Swamiji Protest At Tirumala : పుట్టపర్తి జిల్లా హిందూపురంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వందల మంది నిరసన ర్యాలీ చేశారు. కల్తీ నెయ్యి నిందితులను కఠినంగా శిక్షించాలని కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఎదుట కూటమి నేతలు ఆందోళనకు దిగారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన, ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గత పాలకమండలి ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవోలు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి తదితరులపై చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ స్వామీజీలు ధర్నా చేశారు. వారిని పోలీసులు నిలువరించారు. టీటీడీ ఈవో శ్యామలరావు వారిని చర్చలకు ఆహ్వానించగా 10 మంది సాధువులు వెళ్లారు.
పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవటం ఘోర అపచారమనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. కిలో నెయ్యి కేవలం రూ.320 కొనుగోలు చేసేలా గుత్తేదారుడితో ఒప్పందం చేసుకోవడమేగాకుండా తూతూ మంత్రంగానే తిరుమల ల్యాబ్‌లో నాణ్యత పరీక్షలు నిర్వహించారు. దీంతో తిరుమలలోని ల్యాబ్‌లో నాణ్యతా పరీక్షలు సరిగా జరగడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ ధరను రెట్టింపు చేసి నాణ్యతకు తిలోదకాలిచ్చారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50ఏళ్లుగా సరఫరా చేస్తున్న కర్ణాటక నందిని నెయ్యిని పక్కన పెట్టి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.