Palnadu Gurukula Incident : కార్పోరేట్ పాఠశాలల తరహాలో అత్యాధునిక సౌకర్యాలు, ఉత్తమ ఉపాధ్యాయులచే బోధన, అన్నిరకాల వసతులతో కూడిన వసతిగృహాలు. నిరుపేదలైన పిల్లలను దృష్టిలో ఉంచుకుని, అక్షరాస్యతను పెంపొందించాలనే లక్ష్యంతో ఉభయ తెలుగురాష్ట్రాలలో ప్రభుత్వాలు గురుకుల పాఠశాలను ప్రారంభించాయి. కానీ నేడు వాటి లక్ష్యం నీరుగారిపోతోంది. అరకొర వసతులతో విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గురుకుల విద్యార్థులు తమకు సౌకర్యాలు లేవంటూ రోడ్డెక్కుతుంటే, ఇప్పుడేమో ఏకంగా విద్యార్థులు గోడదూకి పరారయ్యారు.
వివరాల్లోకెళ్తే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఏపీలోని పల్నాడు జిల్లా వంకాయలపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఉదయం ప్రార్థన ముగియగానే పదో తరగతి చదువుతున్న 67 మంది విద్యార్థులందరూ సోలార్ ఫెన్సింగ్‌తో ఉన్న గోడను దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే 27 మందిని పట్టుకున్నారు. మరో 40 మంది పాఠశాల ప్రహరీ గోడ దూకి సమీపంలోని కొండవీడు కొండలపైకి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరారయిన విద్యార్థుల కోసం గాలించారు. 16వ నంబరు హైవే పక్కన ఉన్న తుమ్మపాలెం వద్ద పిల్లలను గుర్తించిన పోలీసులు వారిని గురుకులానికి తీసుకెళ్లారు.
అనంతరం నరసరావుపేట డీఎస్పీ, చిలుకలూరిపేట రూరల్ సీఐ విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసులతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమను ఉపాధ్యాయులు వేధిస్తున్నట్లు ఆరోపించారు. సరైన ఆహారం, మంచి నీరు అందించడంలేదని వాపోయారు. తమకు ఆటలు ఆడుకునేందుకు అవకాశం కల్పించడంలేదని, పరీక్షలు పెడుతూ వేధిస్తున్నారని, ఉచిత విద్యకు కూడా వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ మాట్లాడుతూ నిజానిజాలను దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అప్పటివరకు విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, ఎవరి అనుమతి లేకుండా బయటకు వెళ్లొద్దని తెలిపారు.