Peddapur Gurukul Student Death : జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. గురుకుల పాఠశాలలో తెల్లవారుజామున ఇద్దరు విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో వెంటనే జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకోగానే ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అతణ్ని హుటాహుటిన నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
మళ్లీ ఉదయం పాఠశాలలో ప్రార్థన సమయంలో మరో విద్యార్థి కింద పడిపోవడంతో వెంటనే మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ గురుకుల పాఠశాలను సందర్శించి, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.
'ఉదయం ఎనిమిదిన్నర సమయంలో విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడని కేర్‌టేకర్ వాళ్లు ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాబుపై ఎలాంటి పాము కాట్లు లేవు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యంగానే ఉన్నాడు. కళ్లు తిరుగుతున్నాయని విదార్థి చెప్పాడు. రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నాం' - డా.వెంకటేశ్వర్లు, పిల్లల వైద్యులు
పది రోజుల క్రితం ఇదే పాఠశాలలో ఒక విద్యార్థి మృతి : గత పది రోజుల క్రితం ఇదే గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఒక విద్యార్థి మృతి చెందగా మెరుగైన చికిత్స కోసం ఇద్దరు విద్యార్థులను హైదరాబాద్ తరలించి చికిత్స అందించారు. మళ్లీ శుక్రవారం ఈ విధంగా వేరే విద్యార్థులకు కావడంతో అందులో చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
'ఇలా గత పదిరోజుల క్రితం జరిగినప్పటి నుంచి అందరం అలర్ట్‌గానే ఉన్నాం. నిన్న నైట్ కూడా విద్యార్థులు ఏమీ చెప్పలేదు. ఇవాళ ఉదయం ఒక అబ్బాయి కడుపునొప్పి వస్తోందని చెప్పాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి మళ్లీ జగిత్యాల ఆసుపత్రికి తరలించాం'- గురుకుల పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్
అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు : రాష్ట్రంలో వర్షాకాలం మొదలైనప్పటి నుంచి గురుకుల పాఠశాలతోపాటు ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఫుడ్‌పాయిజన్‌తో కొందరు, పరిసరా ప్రాంతాల్లో చెత్త వ్యర్థాల వల్ల మరికొందరు అనారోగ్య పాలవుతున్నారు. ఇలాంటి ఘనట జరిగిన వెంటనే అధికారులు చర్యలు చేపట్టినా మళ్లీ జరుగుతుండడం గమనార్హం. ప్రభుత్వం సైతం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ సూచిస్తోంది. అయినా కొన్ని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు.