Street Venders Issue In Hyderabad : గ్రేటర్ హైదరాబాద్‌లో చిరు వ్యాపారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక్కడ ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో తినేవాళ్లున్నారు. రూ.5 భోజనాన్ని ఆరగించే వాళ్లూ ఉన్నారు. అంతేకాక పెద్ద పెద్ద వ్యాపార, వాణిజ్య సముదాయాలు నిత్యం కొనుగోళ్లతో ఎంతలా కిటకిటలాడుతాయో, వాటి బయట ఫుట్‌పాత్ పైనా, రోడ్ల పక్కన కూడా అదే స్థాయిలో రద్దీ కనిపిస్తుంటుంది. వారాంతాలు, సాయంత్రం వేళల్లో అయితే కోఠి, బేగంబజార్, చార్మినార్ లాంటి కీలక ప్రాంతాల్లో కాలు తీసి, కాలు పెట్టడానికి వీలుండదు. అంతలా నగరంలో వీధి వ్యాపారుల వద్ద క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. లక్షలాది రూపాయల సరుకులు చేతులు మారుతుంటాయి.
Street Vendors: చిరువ్యాపారుల కోసమే షెడ్లు నిర్మించారు.. కానీ.. ఇచ్చింది మాత్రం..
Hyderabad Street Venders Problems : ఇలాంటి వీధి వ్యాపారులకు మెరుగైన జీవనోపాధిని కల్పించాల్సిన జీహెచ్ఎంసీ ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోంది. నగరంలో ఎంత మంది చిరు వ్యాపారులున్నారనేది జీహెచ్ఎంసీ వద్ద స్పష్టమైన గణాంకాలు లేవు. గతంలో సర్వే చేసిన అంచనా ప్రకారం, గ్రేటర్ వ్యాప్తంగా 1.65 లక్షల మంది వీధి వ్యాపారులున్నట్లు బల్దియా చెబుతోంది. వారిలో 1.35 లక్షల మందిని గుర్తించి గుర్తింపు కార్డులు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో చాలా మందికి పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి కింద రుణాలు అందిస్తున్నామని, అందులో హైదరాబాద్ నగరం ముందుందని కితాబిచ్చుకుంటోంది. వీధి వ్యాపారుల చట్టం 2014 ప్రకారం వారికి కావాల్సిన భద్రత, సౌకర్యాల విషయంలో మాత్రం జీహెచ్ఎంసీ విమర్శలు మూటకట్టుకుంటోంది.
GHMC Helps To Street Venders : గతంలో గ్రేటర్‌లోని వీధి వ్యాపారుల కోసం మూడు రకాల జోన్లను జీఎచ్ఎంసీ(GHMC) అధికారులు గుర్తించారు. ఆ జోన్లలో వీధి వ్యాపారులు వారి విక్రయాలు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు. రోజూవారి వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా గ్రీన్ జోన్ అని, అలాగే తాత్కాలికంగా వ్యాపారాల కోసం యాంబర్ జోన్‌గా, ఇక పూర్తిగా వ్యాపారం చేయడానికి వీలులేని ప్రదేశాలను రెడ్ జోన్లుగా ఎంపిక చేశారు. అయితే గతంలో గ్రీన్ జోన్లలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఓసారి పై వీడియోలోని దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఇదీ వీధి వ్యాపారుల కోసం జీఎచ్ఎంసీ ఏర్పాటు చేసిన పుడ్ జోన్లు.
వీధి వ్యాపారులకు రుణాలు మంజూరుచేసిన ఎమ్మెల్యే వివేకానంద
విరిగిన తలుపులు, పేరుకుపోయిన చెత్తాచెదారం, తాగిపాడేసిన మద్యం సీసాలతో అధ్వాన్నంగా తయారైన స్టాల్స్ ఇవి. హైటెక్ సిటీలో నాలుగేళ్ల కిందట వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన స్ట్రీట్ వెండింగ్ ఫుడ్ హబ్ ఇది. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఫుడ్ హబ్, నిర్వహణ లేక శిథిలావస్థకు చేరింది. జీఎచ్ఎంసీ వెస్ట్‌జోన్ కమిషనర్‌గా పని చేసిన ఐఏఎస్ అధికారిని హరిచందన హయాంలో మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా ఈ ఫుడ్ హబ్ నిర్మించారు. దాదాపు రూ.55 లక్షలు ఖర్చు చేసి ఇక్కడ 50 స్టాల్స్ నిర్మించారు.
జీహెచ్ఎంసీ అనాలోచిత నిర్ణయాలకు మరో ఉదాహరణ శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలోని మోడల్ మార్కెట్ భవనాలు, కూరగాయల షెడ్లు. చందానగర్ రైల్వేస్టేషన్ సమీపంలో దాదాపు రూ.93 లక్షలు ఖర్చు చేసి కూరగాయల మార్కెట్‌ను నిర్మించారు. 2021లో ప్రారంభించారు. 50 స్టాల్స్‌ను నిర్మించిన మార్కెట్ షెడ్డు మూడేళ్లుగా ఖాళీగా ఉంటుంది. వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించడంలో టౌన్ వెండింగ్ కమిటీలు విఫలమవుతున్నాయి. జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లలో సర్కిల్‌కు ఒకటి చొప్పున కమిటీలను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఛైర్మన్‌గా, ట్రాఫిక్ ఏసీపీ, వీధి వ్యాపారులు సభ్యులుగా ఉండే టౌన్ వెండింగ్ కమిటీలు ప్రతి నెల సమావేశం కావాలి. భద్రతపై చర్చించాలి. కానీ, అవేవి జరగడం లేదు.
CM Revanth Reddy : ఏదైనా ట్రాఫిక్ సమస్య తలెత్తి వ్యాపారాన్ని తొలగించాల్సి వచ్చినప్పుడు టౌన్ వెండింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలి. కమిటీలో చర్చించాకే వాటిని తొలగించాలి. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వీధి వ్యాపారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత దృష్టి సారించాలని, చిరు వ్యాపారులను ఆదుకోవాలని రాష్ట్ర వీధి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రేటర్‌లోనే కాదు రాష్ట్రమంతటా వీధి వ్యాపారులది ఇదే సమస్య. ప్రభుత్వం ఇకనైనా దృష్టిపెట్టి వీధి వ్యాపారాన్ని క్రమబద్దీకరిస్తే రాష్ట్రానికి వచ్చే రాబడిలో ఈ వ్యాపారం కీలకంగా నిలవడమే కాకుండా, స్థానిక సంస్థల బలోపేతానికి ఉపయోగపడుతుంది.