story on Woman who selected as Trainer in Sports From Telangana : మన్యంలో పుట్టిన క్రీడా మాణిక్యం ఈ యువతి. బాల్యం నుంచే ఆటలపై ఉన్న ఆసక్తితో సోదరులతో కలిసి క్రీడా మైదానానికి వెళ్లింది. తోటి వారితో ఆడుకోవటం కంటే, మేటి క్రీడాకారిణి నిలవాని లక్ష్యంగా పెట్టుకుంది. అనతికాలంలోనే అథ్లెటిక్స్‌లో ప్రావీణ్యం సంపాదించి ఉత్తమ కోచ్‌గా పేరుగాంచింది. అంతేకాదు, ప్రతిష్ఠాత్మక వరల్డ్ అథ్లెటిక్స్ కోచెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లెవల్-3కి ఎంపికై, పలువురిచే ప్రశంసలు అందుకుంది. మైదానంలో పరుగులు పెడుతున్న ఈ క్రీడా కుసుమం పేరు సునంద కోరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు స్వస్థలం.
రాష్ట్రం నుంచి మొదటి క్రీడాకారిణిగా : తల్లిదండ్రులు సుదర్శన్, సోనీ. డిగ్రీ చేసిన అనంతరం ఎన్ఐఎస్ (NIS), బీపీఈడీ (BP.ed) పూర్తి చేసింది. ఉత్తమ క్రీడాకారిణిగానే కాకుండా అత్యుత్తమ కోచ్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఫలితంగా, తెలంగాణ నుంచి వరల్డ్ అథ్లెటిక్స్ కోచెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లెవల్-3కు ఎంపికైన మొదటి క్రీడాకారిణిగా పేరు గాంచింది సునంద. వరల్డ్ అథ్లెటిక్స్ విభాగం ఎంపిక చేసే ఈ కోర్సుకు అర్హత సాధించాలంటే, నిత్య సాధనతో పాటు అనుక్షణం ఫిట్‌గా ఉండాలి. అంతేకాకుండా కోచ్ శిక్షణలో విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటాలి. అయితే తన నేతృత్వంలో కాచనపల్లి విద్యార్థినులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో 132 పతకాలు సాధించారని సునంద చెబుతోంది.
కోర్సు పూర్తయితే అథ్లెటిక్స్‌కి కోచ్‌గా అవకాశం : 2021లో కేరళ(Kerala)లోని త్రివేండ్రంలో లెవల్-1, 2024 జనవరిలో పంజాబ్‌లోని పట్యాలలో లెవల్-2 కోర్సులను విజయవంతంగా పూర్తి చేసింది సునంద. త్వరలో ఇండోనేషియాలో జరిగే లెవల్-3కు ఎంపికైంది. ఇప్పటి వరకు దేశంలో ఇద్దరు మాత్రమే ఈ కోర్సుకు ఎంపిక కాగా, వారిలో తెలంగాణ నుంచి ఎంపికైన తొలి క్రీడాకారిణి సునంద. ఈ కోర్సు పూర్తయితే ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెటిక్స్‌కి కోచ్‌గా వ్యవహరించే ఆవకాశం దక్కుతుందని చెబుతోంది. క్రీడలపై మక్కువ ఉన్న పిల్లలకు తల్లిదండ్రుల సహకారం తప్పనిసరి అని సునంద అంటోంది. ప్రతి ఒక్కరు అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా ప్రోత్సహించాలని కోరుతోంది.
పరుగుపందెంలో ఇప్పటి వరకు 21 స్వర్ణం, 17 రజతం, 14 కాంస్య పతకాలు సొంత చేసుకుంది సునంద. లెవల్-3 కోర్సుకు ఎంపికైనందుకు పీటీ ఉషా(PT Usha) అథ్లెటిక్స్ అకాడమీ వంటి ప్రముఖ క్రీడా సంస్థలు తనని కోచ్ వ్యవహరించాలని కోరుతున్నాయని చెబుతోంది. వరల్డ్ అథ్లెటిక్స్ కోచెస్ కోర్సు లెవల్-3కి సునంద ఎంపికైనందుకు ఆమె కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోదరులతో సమానంగా సునందనకు సహకారం అందించామని చెబుతున్నారు. వరల్డ్ అథ్లెటిక్స్ కోచెస్ కోర్సు లెవల్-3కి ఎంపిక కావాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. ఆ ప్రతిభ ఈ అడవి బిడ్డ సొంతం అయ్యింది. దాంతో ఒలిపింక్స్‌లో పాల్గొనే అథ్లెటిక్స్ కోచ్‌గా వ్యవహరించడానికి అడుగు దూరంలో ఉంది.
'నాకు స్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ వాళ్లు అవకాశం ఇచ్చారు. మీలాగే పిల్లలు స్పోర్ట్స్‌లో రావాలంటే కోచింగ్ ఇవ్వాలని చెప్పారు. నా నేతృత్వంలో పిల్లలు 132 మెడల్స్ సాధించారు. వారిలో అయిదుగురు జాతీయ స్థాయిలో ఆడారు.'- సునంద కోరి, వరల్డ్ అథ్లెటిక్స్ ఎడ్యుకేషన్ లెవల్-3కి ఎంపికైన యువతి
విలువిద్యలో రాణిస్తున్న ఆదివాసి బిడ్డలు - అంతర్జాతీయ పోటీల్లో గెలవాలన్నదే వారి లక్ష్యం
దేశానికి బంగారు పతకం తేవడమే లక్ష్యంగా తైక్వాండోలో శిక్షణ ఇస్తున్న యువకుడు