Saffron Cultivation In Siddipet District : కిలో దాదాపు రూ.3 లక్షలు. ఈ ఒక్క మాట చాలు కుంకుమ పువ్వుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవడానికి. రైతన్నలకు సిరులు కురిపించే ఆ పంట ఇప్పటి వరకు కశ్మీర్ లాంటి శీతల ప్రదేశాలకు మాత్రమే పరిమితం. కానీ ఇకపై అలా కాదు మన రాష్ట్రంలోనూ కుంకుపువ్వు సాగు సాధ్యమే. తెలంగాణలో ఎక్కడ కుంకుమపువ్వు సాగు చేస్తున్నారు? పంట దిగుబడులు ఎలా ఉన్నాయి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
సిద్దిపేటలో కుంకుమపువ్వు సాగు : సహజంగా చలి ప్రదేశాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోనే కుంకుమ పువ్వు విస్తారంగా సాగుచేస్తున్నారు. అయితే, వర్షాధార పంటలకు నెలవైన తెలంగాణలోని సిద్దిపేటలోనూ కుంకుమపువ్వు ఉత్పత్తి మొదలైంది. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లిలోని డీఎక్స్‌ఎన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ వారు ఏరోఫోనిక్ విధానంలో గత జులైలో ప్రయోగాత్మకంగా వీటి పెంపకం చేపట్టారు.
మార్కెట్లో మంచి కుంకుమపువ్వుకు ఫుల్ డిమాండ్ : తెలుగు లోగిళ్లలో కుంకుమ పువ్వు పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి లేదు. ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యానీతో పాటు పలు రకాల వంటకాల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఖరీదైనటువంటి సుగంధ ద్రవ్యాల్లో కుంకుమ పువ్వు కూడా ఒకటి. సాధారణంగా శీతల ప్రాంతాల్లోనే సాగయ్యేటువంటి కుంకుమపువ్వు పేరు వినగానే కశ్మీర్ గుర్తుకువస్తుంది. క్రోకస్ సాటివస్ అనే పేరు గల మొక్క పూలలోని కేసరాలే కుంకుమపువ్వు. వీటి కిలో ధర రూ.లక్షల్లో పలుకుతుంది.
'600 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న కోల్డ్ స్టోర్‌రూంలో ఉష్ణోగ్రత కనిష్ఠంగా 3 డిగ్రీలు, గరిష్ఠంగా 18 డిగ్రీలు ఉండేవిధంగా ఏర్పాటు చేశాం. కశ్మీర్ ప్రాంతం నుంచి కిలో ఎనిమిది వందల చొప్పున 900 కిలోల మొక్కలను తెప్పించాము. వాటిని 10 ర్యాకుల్లో అమర్చాం' అని ప్రాజెక్టు సమన్వయకర్త పవన్ దేశ్‌పాండే తెలిపారు
ఒక్కో క్రోకస్ సాటివస్ మొక్క 3-4 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. 7 ఏళ్ల వరకు మొక్కను బతికించుకోవచ్చు. ప్రతి చలికాలంలో ఒక మొక్కకు 3-4 పూలు వస్తాయి. ఇప్పటివరకు 200 గ్రాముల కుంకుమ పువ్వు చేతికొచ్చింది. ఈ నెలాఖరుకు మరో 400 గ్రాములు రావచ్చు. త్వరలోనే విపణిలోకి తెస్తాం" - పవన్ దేశ్‌పాండే, ప్రాజెక్టు సమన్వయకర్త
ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు- కృత్రిమంగా కశ్మీర్ వాతావరణం, ఎలాగో తెలుసా?
Saffron cultivation in Hyderabad: కశ్మీర్ కుంకుమపువ్వు పరిమళం.. ఇక నుంచి భాగ్యనగరంలోనూ.!