Portable Cabin House : ఇల్లు, ఆఫీస్, వాణిజ్య సముదాయం, గెస్ట్ హౌస్ ఇలా ఏ నిర్మాణమైనా పునాదుల నుంచి గృహ ప్రవేశం వరకు ఎన్నో వ్యయ ప్రయాసలు ఉంటాయి. పనులు పూర్తైయ్యేందుకు నెలల పాటు వేచి ఉండాల్సిందే. మన అభిరుచికి తగినట్లుగా నిర్మించుకున్న ఇల్లు లేదా కార్యాలయాలను వేరే ప్రదేశానికి తీసుకెళ్లలేము. ఉద్యోగం మారినప్పుడు అక్కడే వదిలేసి వెళ్లాల్సిందే. అయితే ఇదంతా గతం. ఇప్పుడంతా సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇల్లు, కార్యాలయం, దుకాణం ఇలా ఏదైనా సరే నచ్చినట్లు నిర్మించుకోవచ్చు. కావాలంటే మనం కొత్త చోటుకి తరలించుకోవచ్చు. అంతేకాదు నిర్మాణానికి నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరమూ లేదు. కలల గృహం వారం, పది రోజుల్లోనే రెడీ అవుతుంది.
ఆకట్టుకునేలా కంటెయినర్ ఇల్లు : హైదరాబాద్ నగరంతో పాటు చుట్టు పక్కల జిల్లాలు, శివారుల్లో రియల్ ఎస్టేట్ రంగం జోరు మీదుండటంతో సొంత ఫాం ల్యాండ్, ప్లాట్లు కొనుగోలు చేస్తున్న యజమానులు, స్థిరాస్తి లేఅవుట్లు ఏర్పాటు చేసే నిర్వాహకులు, సొంత పొలం కలిగిన యజమానులు ఇప్పుడు పోర్టబుల్ క్యాబిన్స్ (కంటెయినర్ హౌస్) ఏర్పాటు చేసుకుంటున్నారు. అభిరుచికి తగినట్లుగా అధునాతన సౌకర్యాలతో కలల గృహాన్ని, వ్యాపార కేంద్రాన్ని, దుకాణాలను, ఆఫీసులను, అతిథి గృహాలను, ఫాంహౌస్‌లను రోజుల వ్యవధిలోనే సమకూర్చుకుంటున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు లే అవుట్లలో క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్లాట్ల విక్రయాలు అన్నీ పూర్తి కాగానే కంటెయినర్ ఆఫీసును కూడా తరలించుకుపోతున్నారు. ప్లాట్లు, ఫాంల్యాండ్ యజమానులు సైతం తమకు నచ్చినట్లు కంటెయినర్ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో స్థలాన్ని విక్రయించాల్సి వస్తే, ఈ ఇంటిని మరోచోటకు తరలించుకుపోతున్నారు.
సకల సౌకర్యాలతో : కంటెయినర్ హౌస్, ఆఫీసులు అంటే అవేవో తాత్కాలిక ఏర్పాట్లు అనుకుంటే పొరపాటే. మీకు కావాల్సిన విధంగా 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే, జీ+1, పెంట్‌హౌస్, షాప్స్, ఆఫీస్, సైట్ హౌస్ ఇలా అవసరానికి తగిన విధంగా సకల ఏర్పాట్లు కిచెన్, లివింగ్ రూం, బెడ్‌రూంలతో పాటు పూర్తిగా విద్యుత్తు వ్యవస్థ, ఏసీ తదితర ఏర్పాట్లతో పాటు లగ్జరీ ఇంటీరియర్ డిజైన్లతో కలల ఇంటిని నిర్మించుకుంటున్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన కిచెన్ సమకూర్చుకుంటున్నారు. పడక గదిలో ఫర్నీచర్ కళ్లు చెదిరే విధంగా ఉంటోంది.
అవసరాలకు తగ్గట్లుగా : అవసరాలకు తగినట్లుగా కంటెయినర్ హౌస్, పోర్టబుల్ క్యాబిన్స్ రూ.50 వేల నుంచి రూ.20 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వీటిని తయారు చేసే సంస్థలు ఇటీవల కాలంలో చాలానే వచ్చాయి. చదరపు అడుగుకు రూ.900 నుంచి రూ.2 వేల వరకు వ్యయం అవుతోంది. తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ట్రాలకు నగరంలో తయారైన కంటెయినర్ హౌస్, పోర్టబుల్ క్యాబిన్స్లు ఎగుమతి అవుతున్నాయి. చిన్న నిర్మాణానికి 7 నుంచి 10 రోజులు సమయం పడుతుంది. పెద్దదానికి 10 నుంచి 15 రోజుల్లో సిద్ధం చేస్తున్నారు. నిర్మాణ సంస్థలే ఇళ్లను తయారు చేసి, ఎక్కడకు కావాలంటే అక్కడకు డెలివరీ చేస్తున్నాయి. ఇవి 20 నుంచి 30 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉంటాయని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ పోర్టబుల్ క్యాబిన్స్ తయారీదారుడు వివరించారు.