Story On Kondapalli Fort In NTR Dist In AP : అది ఓ శుత్రుదుర్భేద్యమైన దుర్గం. ఎటుచూసినా రాజసం ఉట్టిపడే పురాతన భవనాలు, ఆనాటి చారిత్రక ఆనవాళ్లను చెప్పే రాతిబురుజులు, రాజమహళ్లు, పెద్ద బావులు, కళాఖండాలు ఇవే కొండపల్లి ఖిల్లా పేరు చెప్పగానే మన ముందు కదలాడుతాయి. ఇదెక్కడో కాదండోయ్ మన పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఉంది.
సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్న కొండపల్లి ఖిల్లా : తెలుగు గడ్డపై పేరొందిన చారిత్రక పర్యాటక ప్రదేశాల్లో కొండపల్లి కోట ఒకటి. తూర్పు కనుమల్లో ఉన్న కొండపల్లి ఖిల్లా సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. 10 వ శతాబ్దం నుంచి ఎంతో మంది రాజుల దండయాత్రలను తట్టుకొని నిలిచింది. అక్కడ కొలువుదీరిన శిల్పాలు నేటి తరానికి ఎన్నో కబుర్లును చెబుతున్నాయి. కూలిన గోడలతో ఉన్న దర్బార్, రాణీ మహల్, జైల్‌ఖానా, నాట్యశాలను చూసి అప్పటి నిర్మాణ శైలి గురించి అర్థం చేసుకోవచ్చు.
మౌలిక సౌకర్యాలు కల్పిస్తే మరింత ప్రగతి : గ్యాలరీలోని చిత్రాలు, శిల్పాలను సెల్‌ఫోన్‌తో స్కాన్ చేసినట్లయితే వాటి నోటే వివరాలు వినొచ్చు. ఈ ఆగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ టీడీపీ సర్కారు హయాంలోనే అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో లేజర్ షోతో ఏటా ఉత్సవాలు నిర్వహించి పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఉత్సవాలు బంద్ అయ్యాయి. విజయవాడ నగరానికి 23 కిలోమీటర్లు దూరంలోనే ఉండటం వల్ల ఖిల్లాను అభివృద్ధి చేస్తే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని స్థానికులు తెలియజేస్తున్నారు. ముందుగా కొండపైకి వెళ్లేందుకు వాహనాలు, కోట వద్ద మంచినీటి సౌకర్యం కల్పించి విస్తృతంగా ప్రచారం చేయాలని కూటమి ప్రభుత్వానికి కోరుతున్నారు.
చారిత్రక నిర్మాణాలను పరిరక్షించాల్సిన అవశ్యకత : రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కానీ వారు నిర్మించిన కోటలు మాత్రం చరిత్రకు సజీవ సాక్ష్యంలా నిలుస్తున్నాయి. ప్రస్తుత తరానికి చరిత్ర గురించి తెలుసుకునేందుకు అనాటి చారిత్రక భవనాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. వాటిని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉంది. అప్పుడు మాత్రమే మన చరిత్ర, సంస్కృతి సజీవంగా మనగలుగుతుంది.
శిథిలావస్థలో ఆందోల్ చారిత్రక కట్టడాలు- పునరుద్ధరించాలని స్థానికుల విజ్ఞప్తి