Special Story Of Srikalahasti Palakova : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి అంటే వెంటనే గుర్తొచ్చేది కాళహస్తీశ్వరుని ఆలయం. అక్కడికి వెళ్లిన యాత్రికులు మరిచిపోలేనిది మరొకటి ఉంది. అదే పాలకోవా! కాళహస్తి కోవాను ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇంతకీ ఏమా రుచి? ఏంటి దాని ప్రత్యేకత. దీనికి ఐదు దశాబ్దాల చరిత్ర ఉందండోయ్. కల్తీలేని స్వచ్ఛమైన పాలకోవా ఇక్కడ తయారవుతుంది. పరిసర ప్రాంతాల పాడి రైతుల నుంచి సేకరించిన పాలతో ఈ కోవాను తయారు చేస్తారు.
కోవా తయారు చేసే విధానంలో ప్రత్యేకతలెన్నో : పాలు వేడి చేయడానికి, పంచదారపాకం పట్టడానికి వేరుశనగ పొట్టును ఉపయోగిస్తారు. అదే ఇక్కడి ప్రత్యేకత. వేరుశనగపొట్టు వాడడం వల్ల తగిన స్థాయి ఉష్ణోగ్రతలు పాలకోవాకు అదనపు రుచి తెస్తాయనే అభిప్రాయం ఉంది. అందుకే అధునాతన యంత్రసామాగ్రి అందుబాటులోకి వచ్చినప్పటికీ దశాబ్దాల నాటి సాధారణ పద్ధతిలోనే తయారు చేస్తున్నారు.
శ్రీకాళహస్తి పాల సహకార సంఘం 1974లో ఏర్పాటైంది. ఈ సంఘం పట్టణ పరిసర ప్రాంతాల రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. కొంతభాగాన్ని నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. మరికొన్ని పాలతో అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. రోజూ 1000 లీటర్ల పాలను కోవా, ఐస్ క్రీమ్, భాసుంది తయారీకి వినియోగిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే పాలకోవాకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ వ్యాపారాన్ని విస్తరించడానికి శ్రీకాళహస్తి పాల సహకారసంఘం ప్రణాళికలు రచిస్తోంది.
'శ్రీకాళహస్తి పాలకోవకు మంచి డిమాండ్ ఉంది. సరఫరాదారులకు అందించడంలో అప్పుడప్పుడూ కొంత ఆలస్యమవుతుంది. కొనుగోలుదారులకు నాణ్యమైన కోవాను అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాం. నాణ్యత విషయంలో రాజీపడేదేలేదు. ఇక్కడి కోవాకు ఉన్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని చెన్నై, తిరుపతిలో స్టాల్స్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం.' - శ్రీకాళహస్తి పాల సహకారసంఘం
ఆధ్యాత్మిక ఆరామంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి, పాల ఉత్పత్తులతో రుచికరంగా ఉండే పాలకోవాకు ఎంతో ఖ్యాతి గడించింది. సహజ పద్ధతిలో తయారు చేసే దీని తయారీ ద్వారా వందలాది మంది ఉపాధి లభిస్తోంది. ఈ విస్తరణ విజయవంతమైతే చాలా మందికి జీవనోపాధి లభించే అవకాశాలున్నాయని శ్రీకాళహస్తి పాల సహకారసంఘం వారు చెబుతున్నారు.
Bonkur Palakova : బొంకూరు పాలకోవా.. వారెవ్వా ఆ రుచే వేరయ్యా..