KUDA Chairman Stage Collapses In Swearing Ceremony : కాకినాడలో కుడా (Kakinada Urban Development Authority) ఛైర్మన్ ప్రమాణ స్వీకారంలో ప్రమాదం తప్పింది. కుడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. జనసేన పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్, కుడా ఛైర్మన్‌గా ఎంపికైన తుమ్మల బాబు (Tummala Babu) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కుడా కార్యాలయం వద్ద వేదిక ఏర్పాటు చేశారు. పెద్దాపురం నుంచి భారీ ర్యాలీగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి సభ్యులు, నాయకులు తరలివచ్చారు. వేదిక వద్దకు తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు చిన్నరాజప్ప, నానాజీతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు.
పరిమితికి మించి స్టేజ్‌పైకి జనం చేరడంతో ఒక్కసారిగా అది కుప్పకూలింది. తొలుత వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రసంగం ప్రారంభించిన సమయంలో వేదిక కుప్పకూలిపోయింది. ఈ హఠాత్ పరిణామంతో నాయకులంతా ఆందోళన చెందారు. చినరాజప్పతో పాటు నానాజీ తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి. వేదిక ఎత్తు ఎక్కువగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కింద ఉన్న కార్యకర్తలు వెంటనే నాయకుల్ని అక్కడ నుంచి కిందకి తీసుకువచ్చారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
బిడ్డను చంపేశారు - అడిగితే బెదిరిస్తున్నారు - చంద్రబాబు ఎదుట తల్లి ఆవేదన