SRSP Kakatiya Canal in Dilapidated Stage 2024 : పొలాలకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి కాల్వలు నిర్మిస్తున్నా, నాణ్యతా ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దశాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా ఉండాల్సిన కెనాల్స్, ఒకటి రెండేళ్లకే శిథిలమవుతున్నాయి. చివరి ఆయకట్టు వరకు నీరందించే ప్రధాన కాల్వల్లో రాళ్లు తేలిపోతున్నాయి. హనుమకొండలోని చింతగట్టు వద్ద ఎస్సారెస్పీ - కాకతీయ కాలువ మరమ్మతులకు నోచుకోక దయనీయంగా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సూర్యాపేట వరకూ సాగు నీరు అందించే ఈ కెనాల్ నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తోంది. కాలువ గట్లు దెబ్బతిన్నాయి. భూకంపం వచ్చిందా అన్నట్టుగా దెబ్బతిన్నా, బాగు చేసే వారే కరవయ్యారు. రాళ్లు రప్పలతో కెనాల్ నిండిపోగా, మట్టి తీసేవారు, పిచ్చిమొక్కలు తొలగించే వారే లేకపోవటంతో రోజురోజుకూ పరిస్థితి అధ్వానంగా మారుతోంది. కాలువకు గతంలో అనేక సార్లు మరమ్మతులు జరిగాయి. ఇందుకోసం రూ.కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు.
ఊడిపోయిన సాగర్ ఎస్కేప్ గేట్ - వందల ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు - పుట్టెడు దుఃఖంలో అన్నదాతలు
కానీ నాసిరకం నిర్మాణాలతో కెనాల్ పరిస్థితి ప్రతీసారి మొదటికొస్తోంది. తాత్కాలికంగా పనులు చేయడం, దానికి భారీగా నిధులు ఖర్చు పెట్టడం తప్ప శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయటం లేదు. కాలువలోకి నీళ్లు వదిలినప్పుడు ఆ నీరు లీకై వృథాగా పోతోంది. చింతగట్టు నుంచి వరంగల్ వరకూ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎండాకాలంలో మరమ్మతు పనులు చేయకపోతే ఆ తర్వాత చేసినా కూడా ఫలితం ఉండదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, కాలువ గట్లు బాగు చేసి, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని సమీప గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు. చూడాలి మరి అధికారులు ఏం చేస్తారో అని.