Srisailam and Sagar Projects Under KRMB : శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు చెందిన ప్రాధాన్యంగా గుర్తించిన 15 కాంపోనెంట్లు, ఔట్‌లెట్లను నెల రోజుల్లోగా కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు స్వాధీనం చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ నెల 17న దిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం మినిట్స్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.
Krishna Projects Issues 2024 : విస్తృత చర్చల అనంతరం రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారం తెలిపినట్లు మినిట్స్‌లో స్పష్టం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు చెందిన 15 కాంపోనెంట్లను నెల రోజుల్లోగా కేఆర్ఎంబీకి (KRMB) అప్పగించాలని ఆదేశించింది. ఇందుకు అనుసరించాల్సిన ప్రోటోకాల్స్ ఖరారుకు రెండు రాష్ట్రాల ఈఎన్సీల స్థాయిలో, బోర్డు మధ్య కసరత్తు చేసి వారం రోజుల్లోగా సమగ్ర ప్రణాళికతో రావాలని అందులో తెలిపారు.
KRMB Control Srisailam and Sagar Projects : నాగార్జునసాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ పోలీసుల పటిష్ట నిఘా కొనసాగించాలని, బోర్డు అనుమతి తర్వాతే తెలంగాణ, ఏపీకి చెందిన ఇంజినీర్లు, అధికారులను డ్యాం సైట్ వద్దకు అనుమతించాలని కేంద్ర రిజర్వు బలగాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సాగర్‌కు ముఖ్యమైన మరమ్మతుల పనులు తమ వైపు చేపట్టేందుకు రెండు రాష్ట్రాలకు బోర్డు అనుమతించవచ్చని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు వెంటనే నిధులను విడుదల చేస్తాయని మినిట్స్‌లో పేర్కొన్నారు. 17న జరిగిన సమావేశ నిర్ణయాలను సమీక్షించేందుకు పక్షం రోజుల్లో మరోమారు సమావేశం కానున్నట్లు వెల్లడించారు.
కేంద్రం జారీ చేసిన మినిట్స్‌పై రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పందించారు. దిల్లీలో కేంద్ర జలశక్తి శాఖతో జరిగిన సమావేశంలో శ్రీశైలం, సాగర్‌ల కింద 15 ఔట్‌లెట్లను అప్పగిస్తామని, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రతినిధులు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిపారు. కేంద్రం ప్రతిపాదనలను రాష్ట్ర సర్కార్‌కు నివేదిస్తామని, ప్రభుత్వ ఆదేశాల మేరకే నిర్ణయం తెలియజేస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.
కేంద్రం జారీ చేసిన మినిట్స్‌లో నెల రోజుల్లోనే అప్పగించడానికి అంగీకరించినట్లు పేర్కొనడం శోచనీయమని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సమావేశంలో శ్రీశైలం, సాగర్ ఆపరేషనల్ ప్రొటోకాల్ అంశంపై చర్చకు అనుమతించలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ తెలంగాణ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ఇప్పటికీ జరగలేదని, ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా యాభై శాతం నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు పంచాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు.
తెలంగాణ అంగీకరించినట్లు పేర్కొనడం సమంజసం కాదు : ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించిన అంశాలను అపెక్స్ కౌన్సిల్‌కు నివేదించాలని సమావేశంలో తెలంగాణ స్పష్టం చేసినట్టు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన తరువాతనే అప్పగింతపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ కోరగా, మినిట్స్‌లో మాత్రం తెలంగాణ అంగీకరించినట్లు పేర్కొనడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ విషయాలపై మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఆపరేషనల్ ప్రొటోకాల్స్ సంపూర్ణంగా తెలంగాణకు ఆమోదయోగ్యంగా ఉంటేనే, అప్పగింతకు అంగీకరిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వంపై హరీశ్‌రావు అనుమానపడాల్సిన అవసరం లేదని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎప్పుడూ ముందుంటుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సాగర్ కుడి కాల్వ నుంచి ఐదు టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఏపీకి కేఆర్‌ఎంబీ గ్రీన్‌సిగ్నల్